నారాయణపేట, ఆగస్టు 17 : దేశ మంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. నారాయణపేటకు 25 కి.మీ. దూరంలోని కర్ణాటకలోని కందుకూర్ శివారులో మాత్రం ఊరు ఊరంతా తేళ్ల పంచమి జరుపుకోవడం అక్కడి ఆచారం. వినడానికి వింతగా ఉన్నా.. ఏళ్ల కాలం నుంచి అక్కడి ప్రజలు ఈ పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం నాగుల పంచమి సందర్భంగా స్థానికులతోపాటు ప్రక్క గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కొండపై ఉన్న ఆలయంలో తేళ్ల దేవతకు పూజలు చేస్తుంటారు. తేళ్ల రూపంలో విగ్రహాలకు పాలు పోసి అచ్చం నాగుల చవితి మాదిరిగానే తేళ్ల పంచమి నిర్వహిస్తుంటారు. తర్వాత గుట్టపై ఏ చిన్నరాయిని తీసినా ఉండే తేళ్లను వెతికి వాటిని ఒంటిపై, నాలుకపై, ముఖంపై వేసుకొని విన్యాసాలు చేస్తుంటారు. ఈ రోజు అవి అక్కడకు వచ్చే వారికి ఎలాంటి హాని చేయవని నమ్మకం. అందుకే ఈ వింతను ప్రత్యక్షంగా చూడటానికి తెలంగాణ, కర్ణాటక నుంచి జనం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.