Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. తన బిగ్ బాస్ ప్రయాణాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే ముగించుకోవాల్సి వచ్చింది. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లో భాగంగా మిథిలేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చిన కొత్త కంటెస్టెంట్లకు నాగార్జున ఒక ఊహించని అవకాశం ఇచ్చారు. రూ.15 లక్షలు తీసుకుని వెంటనే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవచ్చని ఆఫర్ చేశారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు ఎక్కువ కాలం కొనసాగాలని ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మాత్రం చేతిలో ఉన్న నగదు మొత్తాన్ని తీసుకుని ఆట నుంచి తప్పుకునే అవకాశం ఇవ్వడంతో కంటెస్టెంట్లకు ఇది పెద్ద పరీక్షగా మారింది.
ఈ ఆఫర్‌పై మిగిలిన కొత్త కంటెస్టెంట్లు వెనక్కి తగ్గారు. బిగ్ బాస్ ప్రయాణాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపారు. అయితే మిథిలేష్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్‌ను అంగీకరించి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మిథిలేష్ బిగ్ బాస్ ప్రయాణం ఊహించని విధంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. మిథిలేష్ తీసుకున్న నిర్ణయం హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్ల మధ్య కూడా చర్చకు దారితీసింది. ఇంత తక్కువ సమయంలోనే షో నుంచి బయటకు వెళ్లడం, అందుకు ప్రతిఫలంగా రూ.15 లక్షలు తీసుకోవడం వెనుక ఆయన ఆలోచన ఏమిటన్నది హౌస్మేట్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకుల్లో కూడా మిథిలేష్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. మిథిలేష్ ఇప్పటికే షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ వారం సాధారణ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఒక కంటెస్టెంట్ ఇప్పటికే డబ్బులు తీసుకుని స్వచ్ఛందంగా బయటకు వెళ్లడంతో ఈ వారానికి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చని కొందరు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. మిథిలేష్ ఎగ్జిట్‌ను ప్రత్యేకంగా పరిగణించి ఈ వారం రెగ్యులర్ ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశం ఒకవైపు ఉంటే.. మరోవైపు నిర్వాహకులు మరో ట్విస్ట్ ఇచ్చి ఇంకొక కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి బయటకు పంపించే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.