న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజే భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. యువ ఆటగాడు ఆయుష్ శెట్టి ఫస్ట్ రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ చాంప్ షి యుచిని ఓడించి అతి పెద్ద సంచలనం సృష్టించాడు. మహిళల సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు సునాయాస విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో కర్నాటకకు చెందిన 21 ఏండ్ల ఆయుష్ 21-14, 13-21, 21-19తో టాప్ సీడ్ చైనా డ్రాగన్ యుచిని ఓడించి తన కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకున్నాడు. హోరాహోరీ పోరులో ఆట ఆరంభం నుంచే భారత కుర్రాడు దూకుడు చూపెట్టాడు. తొలి గేమ్‌లో వరుస పాయింట్లు గెలిచి 11-5 ఆధిక్యంలోకి వెళ్లాడు.
కోర్టులో పాదరసంలా కదిలిన అతను పర్ఫెక్ట్ స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ అవలీలగా ఈ గేమ్ నెగ్గాడు. అయితే రెండో గేమ్‌లో యుచి తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడు. సుదీర్ఘ ర్యాలీలతో పుంజుకుని మ్యాచ్‌ను నిర్ణాయక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. ఇందులో ఆయుష్ ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆడుతూ 11-5తో బ్రేక్‌కు వెళ్లాడు. అదే జోరును కొనసాగిస్తూ తన ఆధిక్యాన్ని 15-5కి పెంచుకున్నాడు. ఈ దశలో చైనా స్టార్ పోటీలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. భారత ఆటగాడు అనవసర తప్పిదాలతో నాలుగు పాయింట్లు కోల్పోవడంతో యుచి 19-20తో నిలిచి మ్యాచ్‌పై ఉత్కంఠ రేపాడు. చివర్లో ఒత్తిడిని జయించిన ఆయుష్ సింపుల్ రిటర్న్‌తో మ్యాచ్ పాయింట్ నెగ్గి ముందంజ వేశాడు. డబుల్స్ తొలి రౌండ్లో హరిహరన్ అంసకరుణన్ – ఎంఆర్ అర్జున్ జోడీ రెండో రౌండ్ చేరింది.
మహిళల సింగిల్స్‌లో ఆరో పతక వేటలో ఉన్న 9వ సీడ్ సింధు 21-7, 21-11తో ఐర్లాండ్ షట్లర్ సోఫియా నోబుల్‌ను వరుస గేమ్స్‌లో చిత్తు చేసింది. 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పవర్ఫుల్ స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో రౌండ్లో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌తో తలపడనుంది. డబుల్స్ లో కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ 21-9, 21-13తో స్పెయిన్ ద్వయం పౌలా లోపెజ్ – లూసియా రోడ్రిగ్జ్ జంటపై విజయం సాధించారు.