నంగునూరు, ఆగస్టు 15 : సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకులలో పీఏసీఎస్ వద్ద యూరియా కోసం లైన్లో నిలుచున్న రైతులను చూసి వారితో హరీశ్‌రావు కొద్దిసేపు మాట్లాడారు. ఎంత సమయం నుంచి వేచి ఉన్నారు.. ఎన్ని బస్తాలు ఇస్తున్నారు.. వంటి విషయాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. బద్దిపడగ ఊర తండాకు చెందిన మహిళా రైతు అనితతో మాట్లాడగా.. తాను గురువారం ఉదయం నుంచి ఇక్కడే ఉంటున్నానని, ఇప్పటి వరకు ఎరువులు దొరక లేదని, రెండు రోజులకు కలిపి రూ.1200 కూలీ సైతం నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎరువుల కోసం క్యూలు కనబడుతున్నాయని, ఎరువులు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో ఎరువుల దుకాణాల వద్ద ఎప్పుడైనా పోలీసులు కనిపించారా అని గుర్తుచేశారు. ఎరువుల బస్తాల కోసం రైతులను లైన్లో నిలుచోబెట్టి పాత రోజులను కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పొద్దున 5 గంటలకే ఎరువుల కేంద్రాల వద్దకు రైతులు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోయిన వానకాలంలో సిద్దిపేట జిల్లాలో 5.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, ఈసారి కాలం సరిగ్గా కాక, కాళేశ్వరం నీళ్లు రాక 4,50 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 1,20 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, పూర్తిస్థాయిలో రైతులు పంటలు వేసి ఉంటే ఎరువుల కోసం ఇంకా ఎంతో కష్టమయ్యేదో అని హరీశ్‌రావు అన్నారు.
కేసీఆర్‌ను తిట్టుడు కాదు.. పాలన మీద దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌కు స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డే చెబుతున్నాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు కలిపి 16 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు ఎరువులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. సెమీ కండక్టర్ యూనిట్ ఏపీకి పోతది, లేదంటే గుజరాత్‌కు పోతాయని, తెలంగాణకు మాత్రం బడ్జెట్లో డబ్బులు ఇయ్యరు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు ఇవ్వరు.. చివరికి ఎరువులు కూడా ఇయ్యరని హరీశ్‌రావు అన్నారు. నానో ఎరువులు వేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని, ఎరువులు ఇస్తే రైతులు వాళ్ల పొలాల్లో చల్లుకుంటారన్నారు. ఎరువుల సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి, సబ్సిడీ ఎగబెట్టడానికి రైతులను మోసం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇప్పుడు ఎందుకు లైన్లో నిలుచున్న రైతుల దగ్గరకు రావడం లేదని ప్రశ్నించారు. పచ్చిరొట్టె విత్తనాలు సరఫరా చేయలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని హరీశ్‌రావు విమర్శించారు. ఎండాకాలంలో వడగండ్లకు పంట నష్టపోతే ఇప్పటి వరకు రూపాయి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పుణ్యమా అని ఊర్లలో మళ్లీ మోటర్ వైండింగ్ దుకాణాలు తెరుచుకున్నాయని, రేవంత్ ప్రభుత్వానికి చేతలు తక్కువ, మాటలు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రైతుల కంటే మీకు పదవులే ముఖ్యమా అని హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. హరీశ్‌రావు వెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్, ఇతర నాయకులు ఉన్నారు.