సిద్దిపేట, జూన్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని, సీఎం రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, వృద్ధులను, యువతను ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని, మూడేండ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం చేపట్టేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని మేలో ఎల్కతుర్తి వద్ద నిర్వహించిన బహిరంగ సభకు సిద్దిపేట నుంచి యువత పాదయాత్రగా తరలివెళ్లి విజయవంతం చేశారు.
గురువారం రాత్రి సిద్దిపేటలో రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని పాదయాత్ర చేసిన యువతను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత వ్యసనాలకు బానిస కావద్దన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ తో కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలన్నారు.
పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదని, ఏదో ఒక పనిచేసి ముందు జీవితంలో స్థిరపడాలన్నారు. మీలో ప్రతి ఒకరూ ఒకో నాయకుడు కావాలని, అం దుకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హరీశ్‌రావు ధీమా ఇచ్చారు. మద్యం, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. తన టీమ్‌లో అలాంటి వ్యసనపరులకు స్థానం లేదన్నారు. కార్యక్రమం లో నాయకులు కడవేర్గు రాజనర్సు, పూజల వెంకటేశ్వరరావు, కొండం సంపత్‌రెడ్డి, శ్రీహరి యాదవ్, బర్ల మల్లికార్జున్, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేశ్, తిరుమల్‌రెడ్డి, మేర్గు మహేశ్, రెడ్డి యాదగిరి తదిత రులు పాల్గొన్నారు.