సిద్దిపేట, మే 5: రైతుల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. పలువురు రైతులు తాము మారెట్లో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. రైతులకు భరోసా కల్పిస్తూ ఓదార్చారు.కొనుగోళ్లను వేగవంతం చేస్తామని ధైర్యం చెప్పారు. శనివారం మారెట్లో కాంటాపెట్టిన ధాన్యం బస్తాలను లారీలు లేక మిల్లులకు తరలించలేదని, దీంతో వర్షానికి ధాన్యం బస్తాలు తడిసిపోయాయని రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
మారెట్లో హమాలీలు, లారీల సమస్య ఉందని తెలుపగా వెంటనే డీసీఎస్వో, ఆర్డీవోకు ఫోన్లో మాట్లాడారు. లారీలు, హమాలీలను సమకూర్చక పోవడంతో ధాన్యం తడిసిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం వల్ల అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కాంటా అయిన వెంటనే ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు.
ఇప్పటికే ధాన్యం తడిసి ముకవాసన వస్తున్నాయని, మరో రెండు రోజులు ఉంటే మొలకలు వచ్చే అవకాశం ఉందన్నారు. డీసీఎస్వో మారెట్ యార్డుకు వచ్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు. లారీ అసోసియేషన్ యజమానులతో మాట్లాడి లారీలను పంపాలని కోరారు. జిల్లాలోనే ఆతిపెద్ద మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో వారాల కొద్దీ కాంటాలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టార్పాలిన్లు లేక అకాల వర్షాలకు ధాన్యం తడిసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 72 గంటల్లోగా డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మారెట్ కమిటీ చైర్మన్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాలసాయిరామ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు గుండు భూపేశ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు దరిపల్లి శ్రీను, సుందర్, నర్సింహులు పాల్గొన్నారు.
నంగునూరు, మే 5: అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గపల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న మామిడి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో 1800 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ, హార్టికల్చర్‌శాఖ, రెవెన్యూశాఖ అధికారులు పంటనష్టం అంచనావేసి తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత నెలలో ఐదుసార్లు వరుసగా అకాల వర్షాలు పడ్డాయని, మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన గాలితో వర్షం కురిసిందని, దీంతో వరి, పండ్ల తోటల రైతులు నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు లింగంగౌడ్, మాజీ సర్పంచ్ బాలయ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, మండల వ్యవసాయాధికారి గీత, ఆర్ఐ లింగం పాల్గొన్నారు.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
ధాన్యం జల్లి పట్టి నాలుగు రోజులు అయింది. గన్నీ బ్యాగులు ఇవ్వమంటే నంబర్ ప్రకారం ఇస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్లకు ఇష్టమొచ్చినోళ్లకు ఇచ్చిం డ్రు. ఆదివారం గాలి దుమారంతో కురిసిన వాన నన్ను ఆగం చేసింది ధాన్యం మొత్తం తడిసింది. కనీసం ఇక్కడ తాగేందుకు నీళ్లు కూడా పెట్టలేదు. చెట్ల కిందే సేదతీరుతున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రం ఒక దగ్గర ఉంటే గోనే సంచులు మరో దగ్గర పెట్టిండ్రు. రైతులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు వసతులు మంచిగా ఉన్నాయి. ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ధాన్యం తడిసింది.
– తన్నీరు యాదగిరి, రైతు, కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా
ఆదివారం సాయం త్రం కురిసిన గాలివానకు వరద వచ్చి మారెట్ యార్డులో ధాన్యం కొట్టుకుపోయింది. నాలుగు రోజుల క్రితం మారెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చాం. వర్షం వల్ల వడ్లన్నీ తడిసిపోయాయి. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలి. ఆరుగాలం కష్టం వరద పాలైంది. మమ్ముల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బాపురెడ్డి, రైతు, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా
15 రోజుల కింద మార్కెట్‌కు నాలుగు ట్రాక్టర్ల ధాన్యం తెచ్చా. అధికారులు తేమశాతం రాలేదని ధాన్యం కొనలేదు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఒక బస్తా లారీ ఎకాలంటే రూ.30 వరకు ఖర్చు చేయకతప్పడం లేదు. ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వానకు వడ్లన్నీ తడిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలి.
-పాపయ్య, రైతు, ఎన్సాన్పల్లి, సిద్దిపేట జిల్లా
ఆరుగాలం చేసిన పంట ఆదివారం కురిసిన వడగండ్ల పాలైంది. మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగుచేశా. ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టా. నిన్న ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ధాన్యం తడిసింది. ఏంచేయాలోఅర్థం కావడంలేదు. సోమవారం ఉదయం వడ్లు ఆరబోసినం. ఇవి ఎప్పుడు ఎండుతాయో,ఎప్పుడు కాంటా అవుతాయో తెలియడం లేదు.
-నిమ్మనగొట్టు రాజయ్య, రైతు, కోహెడ, సిద్దిపేట జిల్లా