సిద్దిపేట, ఏప్రిల్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండుటెండల్లోనూ కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయని, సిద్దిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85,000 ఎకరాల్లో వరిసాగువుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 300 మందికి రూ. 62 లక్షల 88 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఒకప్పుడు సిద్దిపేట వాసులు ముంబయి, దుబాయికి వలసవెళ్లేవారని గుర్తుచేశారు. నేడు బీహార్, ఛత్తీస్‌గఢ్ కూలీలకు సిద్దిపేట నియోజకవర్గం ఉపాధి చూపుతోందన్నారు. వ్యవసాయంతో పాటు ఐటీ, పారిశ్రామిక రంగాల్లోనూ సిద్దిపేటలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్‌ఫండ్ సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇచ్చారన్నారు. ఇప్పటిదాకా 12,857 మందికి రూ. 41 కోట్ల 13 లక్షలు సాయం చేసినట్లు గుర్తుచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏ పల్లెలో చూసినా కాలువల్లో గోదావరి నీళ్లు గలగలా పారుతున్నాయని, 85 వేల ఎకరాల్లో వరి ధాన్యం పండుతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనకు ఒక వరం. ఆ కాళేశ్వరమే లేకపోతే సిద్దిపేట నియోజకవర్గం ఇలా ఉండేదా అని ప్రతి ఒకరూ ఆలోచించాలన్నారు.
సాగునీరు పుషలంగా ఉండటంతో నంగునూరు, చిన్నకోడూరులో రైతులు మిర్చి సాగు చేసి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. ఇంకొంతమంది ఆయిల్‌పామ్ తోటలు సాగుచేసి లాభాలు పొందుతున్నారన్నారు. మిట్టపల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని, సిద్దిపేట ఐటీపార్ ద్వారా ఇప్పటికే 600 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించగలిగామన్నారు. అటు వ్యవసాయం, ఇటు ఉపాధి, మరోవైపు ఐటీ రంగం.. ఇలా అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలిపామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బాల్‌రంగం, శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, దువ్వల మల్లయ్య,మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.