సిద్దిపేట,జూన్25: నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ వార్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు చదువుకుంటారనే లక్ష్యంతో సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని తీసుకువస్తే రేవంత్‌రెడ్డి దానిని కొడంగల్‌కు తరలించారని మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఇకడ తిరుగుతున్నారో వాళ్లకే తెలియాలన్నా రు. నెలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని చెప్పి 31 నెలలుగా మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ఒకో అవ్వాతాత, బీడీ కార్మికురాలికి ఏకంగా రూ. 62,000 బాకీ పడ్డారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సీములు ఏమీ రాలేదు కానీ అన్నీ సాములే అన్నారు. ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్ల కోసం సైకిల్, ఆటోకు బకెట్ కట్టుకొని ట్యాంకర్ల వెంట తిరిగేవాళ్లమని, వారానికి, ఐదు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని గుర్తుచేశారు. గులాబీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం, మల్లన్నసాగర్ కట్టిన తర్వాత ఇప్పుడు సిద్దిపేటలో రోజూ ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయన్నారు. ఈరోజు హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వడానికి 8 వేల కోట్లతో లైన్లు వేస్తున్నారు, కానీ సిద్దిపేటలో ఎప్పటి నుంచో కాళేశ్వరం, మల్లన్నసాగర్ నీళ్లు తాగుతున్నామన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే సందులు, పందులు గుర్తుకొచ్చేవి ఇప్పుడు పం దులు లేకుండా చేశామన్నారు.
ఇరుకు సందుల్లో ఉన్న మురుగు కాల్వలను తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి చెత్త కుప్పలు లేకుండా పరిశుభ్రంగా మార్చామన్నారు. వార్డులో 95 శాతం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మిగిలి పనులు కూడా పూర్తి చేసుకుందామన్నారు. మెడికల్, నర్సింగ్, బీ-ఫార్మసీ, డైట్ కాలేజీలు సిద్దిపేటకు తెచ్చుకున్నామన్నారు. రైలును ఇవాళ సిద్దిపేట దాకా తీసుకొచ్చి ప్రజల కల సాకారం చేశామన్నారు. పట్టణం చుట్టూ రెండు రింగ్ రోడ్లు వేసుకున్నామని, వెంకటేశ్వరస్వామి ఆలయం, దాని వెనుక ధ్యానమందిరం, అన్నదాన సత్రం నిర్మించుకున్నామన్నారు. మైనార్టీ సోదరుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. దవాఖానలో కాన్పు జరిగితే కేసీఆర్ కిట్ కింద రూ.12 వేలు ఇచ్చి తల్లీబిడ్డను ఇంటికి పింపిస్తే కాంగ్రెస్ సర్కార్ బంద్ పెట్టిందన్నారు. ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్నారు కానీ బంగారం రాలేదు ధర మాత్రం పెరిగిందన్నారు. కోమటి చెరువును నెక్లెస్ రోడ్డులా మార్చుకున్నామన్నారు.
సిద్దిపేటలో శిల్పారామం కడితే కాంగ్రెస్ వాళ్లు వచ్చి సగంలోనే ఆపేశారన్నారు.రంగనాయకసాగర్ దగ్గర టూరిస్ట్ ప్లేస్ పనులు కూడా ఆపేశారన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక చదువులు ఆగం చేశారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండున్నరేండ్ల్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు మెండిచేయి చూపించారన్నారు. కప్పలకుంటను అభివృద్ధి చేయడానికి రూ. కోటి మం జూరుచేయించానని , తొందరలోనే అకడ వా కింగ్ ట్రాక్, లైటింగ్,కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు పెట్టిస్తానన్నారు.వార్డు సభ్యుడు కంతుల రమేశ్ కష్టపడి పనిచేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొం డం సంపత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జం గింటి కనుకరాజు, మెహన్‌లాల్,ఫక్రొద్దీన్ పాల్గొన్నారు.