చిన్నకోడూరు, మే 23: “మీ గ్రామం మీద ప్రేమతో పెద్దమ్మ పండుగకు ప్రతి సంవత్సరం మీరు పిలవగానే వస్తా.. పదేండ్ల కింద విఠలాపూర్ మారుమూల పల్లె… తాగు నీటి గోస.. చుక నీళ్లు లేక పాయే అలాంటి పల్లెకు తిప్పలు తప్పి అభివృద్ధి చేసుకున్నాం” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాలకు శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
కాళేశ్వరం ఉత్తది అయితే విఠలాపూర్ గ్రామంలోని చెరువు, కాల్వల్లో నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలింది అనే వారు విఠలాపూర్ గ్రామానికి వచ్చి చూడాలని సూచిం చారు. కాళేశ్వరంలో నీళ్లు లేనిది ఎండాకాలం విఠలాపూర్ అనంతమ్మ చెరువు ఎట్లా మత్తడి దుంకుతుందన్నారు. పెద్దమ్మ తల్లి దయ, కేసీఆర్ దీవెనతో కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ల బాధలు తప్పాయన్నారు.. కాల్వలు, చెరువుల్లో జల కళ వచ్చిందన్నారు.
కొంతమంది కాళేశ్వరం కూలింది అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో కరెంట్ బాధలు, తాగు నీటి గోస తీరిందన్నారు. రోడ్లు మంచిగా చేసుకున్నామని, గంగపూర్, విఠలాపూర్‌కు డబుల్ రోడ్డు వేసుకుంటున్నట్లు గుర్తుచేశారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2500, రూ. 4000 వేల పింఛన్, కేసీఆర్ కిట్ రేవంత్‌రెడ్డి ఏగొట్టాడన్నారు. పెద్దమ్మ తల్లి దయతో అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ నవీన్, మాజీ ఎంపీటీసీ, ముదిరాజ్ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.