చిన్నకోడూర్, మే 26: దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్ని ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన చదువుకు లండన్, అమెరికాలో పెద్దపెద్ద ఉద్యోగాలు వచ్చేవని, ఆయన తన చదువును దేశం కోసం ఉపయోగించాడని, రాజ్యాంగం రచించాడని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే గొప్ప సూత్రాన్ని అంబేద్కర్ చెప్పినట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను పాటించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవిష్యత్‌ను ఊహించి రాజ్యాంగం రచించారని, మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు ఇచ్చారని గుర్తుచేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాం గం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైనట్లు తెలిపారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానాలు అవసరం లేదని, ఆర్టికల్- 3 ఉంటే చాలని ఆనాడే అంబేద్కర్ రాశారన్నారు. అందుకే అంబేద్కర్ అందరివాడని.. కానీ, తెలంగాణకు మరింత దగ్గరి వాడని హరీశ్‌రావు అన్నారు.
దేశంలో ఏ సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టలేదని, తెలంగాణలో అత్యద్భుతంగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు కేసీఆర్ పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకొని గౌరవిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఓవర్ సీస్ సాలర్షిప్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. సమాజంలో కుల అసమానతలు పోవాలంటే విద్య అనేది చాలా అవసరం అని, అందరికీ విద్య అందుబాటులో ఉండాలని గురుకులాలను కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఒకటే విద్య అని, విద్య అనేది ఉద్యోగం కోసమే కాదని, మనిషికి మంచి ఆలోచన ఇస్తుందన్నారు. విలువలతో కూడిన జీవనాన్ని ఇస్తుందన్నారు. మన హకులను పొందడానికి ఉపయోగపడుతుందని, మగ, ఆడ అనే తేడాలేకుండా అందరికీ సమానమైన విద్యను అందించాలని తెలిపారు.
ఈ రోజుల్లో ఆడపిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారని, వారికి విద్య అందించాలని కోరారు. ఏటా నూతన సంవత్సరం వేడుకలు తాను కుటుంబంతో జరుపుకోనని, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో జరుపుకొంటానని తెలిపారు. ఆడపిల్లలు డిగ్రీ చదవాలని కేసీఆర్ ఆరోజే 75 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంటరానితనం లాంటి ఏదైనా సమస్యలు ఉంటే తనకు ఒక మెసేజ్ చేయాలని, ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, మాజీ సర్పంచ్ స్వర్ణలత శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పరశురాములు, నాయకులు పోచబోయే శ్రీహరి యాదవ్, కొండం రవీందర్ రెడ్డి మేడికాయల వెంకటేశం, పాపయ్య, జంగిటి శ్రీనివాస్, డిబిఎఫ్ శంకర్, బాబురావు, మెట్ల శంకర్, ఉమేశ్‌చంద్ర, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు