కొండాపూర్, మే 4 : మాజీ మంత్రి హరీశ్‌రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు నుంచి పక్క నుంచి వెళ్తున్న కారుపై పడిపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయణిస్తున్నారు. ఆ సమయంలో ఇదే రహదారిపై జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రమాదాన్ని చూసి చలించి వెంటనే తన కారు దిగి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికులు, తన వెంట ఉన్న సిబ్బంది , నాయకుల సహాయంతో బాధితులను కారునుంచి వెలికితీశారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని దవాఖానకు తరలించారు. ప్రమాదం గురించి సంగారెడ్డి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. వీరికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
హరీశ్‌రావు స్పందించిన తీరును చూసి స్థానికులు ప్రశంసలు కురిపించారు. కొండాపూర్ సీఐ వెంకటేశం వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం బుల్కపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, అరుణ, నవీన్‌గౌడ్, ఈశ్వర్‌గౌడ్, జగన్మోహన్గౌడ్ కలిసి శంకర్పల్లి నుంచి సదాశివపేటకు బయలుదేరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని జాతీయ రహదారి 65పై వెళ్తున్న క్రమంలో వెనక నుంచి కట్టెల లోడుతో వస్తున్న లారీ డివైడర్ ఎక్కి ఒక్కసారిగా పక్కనే ఉన్న కారుపై పడిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.