నర్సాపూర్, జూన్ 23: “మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్సవాలు చేసుకోవాలంటున్నాడు… ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుకొంటారని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన మాట్లాడారు. రైతుభరోసా ఎగ్గొట్టినందుకా… రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుకా… ఎందుకు రైతులు ఉత్సవాలు జరుపుకోవాలంటూ ఘాటుగా ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా ఇచ్చిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే గత యాసంగి, వానకాలానికి సం బంధించి పెండింగ్‌లో ఉన్న రైతుభరోసా వేసి ఉత్సవాలు జరుపుకోవాలని డిమాండ్ చేశా రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటుకు నాటుకు రైతుబంధు వేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓట్లకు ఓట్లకు రైతుభరోసా వేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11సార్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో జమచేశారుని గుర్తుచేశారు. కరోనా సమయంలో కూడా రైతుబంధును ఆపలేదని వెల్లడించారు.
వంద రోజుల్లో గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి మాటతప్పారని, గాంధీభవన్‌కు గొర్రెలను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బోనస్ పడలేదని మండిపడ్డారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో డీఏపీ కొరత ఉందని, రైతులకు దొరకడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఢిల్లీ నుంచి సంవత్సరానికి పదుల సంఖ్యలో అవార్డులు వచ్చేవని రేవంత్‌రెడ్డి పాలనలో ఒక్కటి కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు.
అంతకు ముందు మండలంలోని చిప్పల్తుర్తి గ్రామా న్ని సందర్శించి పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాక్టర్లో డీజిల్‌కు డబ్బులు లేక 20 రోజుల నుంచి చెత్తతీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ల కుటుంబాల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. పంచాయతీ సెక్రటరీ సొంతంగా రూ.80 వేలు అప్పు చేసి పంచాయతీ పనులను నెట్టుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.