సిద్దిపేట, మే 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాడు నమ్మించడం నేడు వంచించడం కాంగ్రెస్‌పార్టీ నైజమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిరుద్యోగులను ఏకం చేసి సెక్రటేరియట్ ముట్టడిస్తామన్నారు. తక్షణమే నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ఎలా ప్రిపరేషన్ అవుతున్నారని నిరుద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, యువ త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే, సీఎం రేవంత్ యువతే నోటిఫికేషన్లు వద్దంటుందని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు అంటూ నమ్మబలికారన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి నాడు నమ్మించారు..నేడు వంచించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీచేశామని గుర్తుచేశారు.
మిగిలిన వాటికీ కాయితాలు పంచి రేవంత్‌రెడ్డి ఖాతా లో వేసుకున్నాడన్నారు. పోలీస్‌శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని డీజీపీ స్వయంగా చెప్పారన్నారు. మరి ఎందుకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలేరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 40వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల్లో చాలా ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే నోటిఫై చేసి భర్తీ చేయాలన్నారు.
చిల్లర మాటలు కాదు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ అయ్యిందన్నారు. నిరుద్యోగ భృతి ఒక దగా, ఆడపిల్లలకు సూటీ ఒక దగా, జాబ్ నోటిఫికేషన్లు ఒక దగా అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేస్తున్నారన్నారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, తెలంగాణ బీఈ డీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు భుక్యా కుమార్ మాట్లాడారు. అంతకుముందు ఫ్లకార్డులతో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.