సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 3: కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై అవగాహనతో పాటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై శుక్రవారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రభుత్వ క్యాబినెట్ సమావేశంలో మూసీనదికి మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని మంత్రులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మల్లన్నసాగర్ సీఎం రేవంత్‌రెడ్డి అయ్య కట్టలేడు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్‌కు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామనుకుంటున్న కాం గ్రెస్ అదే ప్రాజెక్టుపై ఎన్నో విమర్శలు చేసిందని, ఇప్పుడు కాళేశ్వరం హైదరాబాద్, మూసీనదికి వరంగా మారిందని స్పష్టం చేశారు. కనీసం జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు చేసే సోయి కూడా కాంగ్రెస్‌కు లేదన్నారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు.
నాలుగు లక్షల ఎకరాల సాగు కోసం చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఐదు నియోజకవర్గాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పక్కనపెట్టిందని విమర్శించారు. సీఎం జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం మంత్రులు కూడా ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. వెంటనే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు మెదలు పెట్టాలని, లేని పక్షంలో రైతులతో పోరాటం చేస్తామని, అవసరమైతే పాదయాత్ర చేసేందుకు వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జిల్లాలోని జొన్న రైతులకు ఇవ్వాల్సిన రూ.78 కోట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం, డబ్బులు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన దాదాపు 700 ఎకరాల భూములు ఆక్రమించుకోవడంపై ఆయన మండిపడ్డారు. పేదల భూముల జోలికి రావద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 31 నెలలు అయినా ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఉద్యోగులకు ఆరు డీఏలు, విద్యార్థుల ఫీజు రీయిబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉద్యోగ విరమణ సౌకర్యాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, రూ.4వేలకు పెంచుతామన్న పింఛన్లపై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శం అని స్పష్టం చేశారు. ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టలేదని గుర్తు చేశారు. సీఏం రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎమ్మెల్యే ఎండగట్టారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంతో పాటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పెంచడంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఓటు విలువైనదని,అర్హులు ఓటు హక్కు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు పెంచాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారాని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లా కేంద్రంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసేలా కలెక్టర్‌కు సూచించాలని హరీశ్‌రావును కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాల మురళీ, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రాగౌడ్, శశిధర్‌రెడ్డి, శివకుమార్, జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, హకీం తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై బూత్ లెవెల్ ఏజెంట్లకు హరీశ్‌రావు అవగాహన కల్పిస్తూ కేసీఆర్ అభిమానుల ఓట్లు పోకుండా కాపాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. బూత్ స్థాయి అధికారులతో పాటు అన్ని పార్టీలకు రాజ్యాగం కల్పించిన హక్కు ఎస్ఐఆర్ అని స్పష్టం చేశారు. ప్రతి 20 ఏండ్లకు ఒకసారి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ఉంటుందని, 2002 తర్వాత నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలు విధిగా నింపాలని, లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతామన్నారు. ఫారాన్ని నింపే విధానంపై స్పష్టంగా వివరించారు.