నారాయణఖేడ్, జూలై 13: మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టులోని జలాలను ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి జహీరాబాద్, అందోల్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య ఏర్పడిందని, మోటార్లకు నీరందక మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, జిల్లాలో తాగునీరు ఎందుకు సరఫరా కావడం లేదో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్హాల్లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అధ్యక్షతన ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నీటితో నిండి ఉన్న సింగూరు ప్రాజెక్టును మరమ్మతుల పేర ఖాళీ చేయడం ద్వారా బోరంచ, పోచారం, రాఘవాపూర్, పాంపాడ్ల వద్ద మోటార్లకు నీరందక మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదన్నారు. ప్రాజెక్టు నీటిని ఖాళీ చేసి ఆరు నెలలైనా కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు కళ్లారా చూసి అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు రోజూ వచ్చిన మిషన్ భగీరథ నీరు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సైకో మాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే రీతిలో మాట్లాడుతున్న రేవంత్‌కు ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్‌కుమార్‌కు పెద్ద తేడా లేదన్నారు. తనతో పాటు తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లితే పంటలు పండుతాయని మాట్లాడిన సీఎం రేవంత్‌పై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబర్లు, జర్నలిస్టులపై కేసులు పెట్టే పోలీసులు రేవంత్ మాటలపై ఏంచర్యలు తీసుకుంటారని, సీఎంకు ఒక చట్టం సామాన్యులకు మరో చట్టం ఉంటదా అని నిలదీశారు. రైతులు పడుతున్న కష్టాలు చూడలేక కన్నెపల్లి నుంచి కాళేశ్వరం జలాలను పంపింగ్ చేసుకోవచ్చని సలహా ఇచ్చిన రిటైర్డు ఇంజినీర్లను చంచల్‌గూడ జైలుకు పంపుతానని రేవంత్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టినందుకు తాను గతంలో ఎగవేతల రేవంత్‌రెడ్డి అని సంబోధిస్తే తనపైనా కేసు నమోదు చేశారన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీపై దేవుళ్లపై ఓట్టు వేసి మరీ హామీ ఇచ్చిన రేవంత్ ప్రకటించింది రూ.35 వేల కోైట్లెతే చేసింది రూ.18 వేల కోట్లేనని ఇంకా 50 శాతం మందికి రుణమాఫీ కాలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న రేవంత్ మూసీ సుందరీకరణకు రూ. లక్ష కోట్లు, ఫ్యూచర్ సిటీకి రూ. లక్ష కోట్లు, అందాల పోటీలు, ఫుట్‌బాల్ ఆడేందుకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎగ్గొట్టిన రైతు భరోసాతో ప్రభుత్వం రైతులకు రూ.19 వేల కోట్లు బాకీ పడిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేసిన బృహత్తరమైన పథకాలను రేవంత్ ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. రైతాంగాన్ని ఆగం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టబోమని, కేసీఆర్ పథకాలను బంద్ పెట్టిన కాంగ్రెస్‌కు బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు స్థానాలు కోల్పోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో నారాయణఖేడ్ స్థానం చేజారిందని, ఈసారి కలిసికట్టుగా పనిచేసి మళ్లీ మహారెడ్డి భూపాల్‌రెడ్డిని గెలిపించడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధిని వంద కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టిద్దామన్నారు. బీఆర్ఎస్ హ యాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో రెండు మార్కెట్‌యార్డులతో పాటు ఎనిమిది గురుకల పాఠశాలలు, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారమైందని చెప్పారు.
ఎస్ఐఆర్పై పార్టీ బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సూచించారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ పూరించి బీఎల్వోకు సమర్పిస్తేనే ఓటు నమోదవుతుందని, లేని పక్షంలో ఓటు ఉండదన్నారు. ఓటర్ల ఫారాలు బీఎల్వోలకు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు తొలిగింపునకు గురయ్యాయనే విషయం గుర్తించి ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత 26వ తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్త జైపాల్‌రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మాజీ టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు పట్నం మాణిక్యం, రాజేందర్, కొలన్ బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, శ్రేయారెడ్డి, మోయిద్‌ఖాన్, పరమేశ్, ఎం.ఏ.నజీబ్, పరశురామ్, ముజామి ల్, అభిషేక్ శెట్కార్, నగేశ్, నర్సింహారెడ్డి, అలీ, వెంకట్‌రెడ్డి, కృష్ణ, విఠల్‌రావు, పండరి, రాంసింగ్, దిలిప్‌కుమార్, జగదీశ్వర్‌చారి, సాయిరెడ్డి, సంజీవ్‌రావు, శ్రీనివాస్, సుభాష్‌గౌడ్, సత్యనారాయణ, గీతారెడ్డి పాల్గొన్నారు.
నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల సాగునీటి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బసవేశ్వర, ఎత్తిపోతల పథకాల పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, బసవేశ్వరుడి స్ఫూర్తితో సంగమేశ్వరుడి దీవెనలతో త్వరలో పాదయాత్ర చేస్తానని హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ నుంచి ఝరాసంగం వరకు పాదయాత్ర చేసి ఆయా ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మూసీ ముద్దు అంటున్న సీఎం బసవేశ్వర ఎందుకు వద్దంటున్నారని, ఇక్కడి ఎమ్మెల్యే అడగడం లేదా అని ప్రశ్నించారు. ఆయా ఎత్తిపోతల పథకాల పనులు నిలిపివేసిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. 60 ఏండ్ల వెనుకబాటు తనాన్ని పదేండ్లలో దూరం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి కేవలం ప్రతిపాదనలు చూపుతూ మంజూరైనట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అబద్ధపు మాటలతో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలతో గెలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో నారాయణఖేడ్‌లో మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అందరు కలిసికట్టుగా పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను అరిగోస పెడుతున్న రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన విధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా మహారెడ్డి భూపాల్‌రెడ్డిని గెలిపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కోరారు. పార్టీ శ్రేణులు ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచనలు పాటించాలని సూచించారు.