సిద్దిపేట, జనవరి 25: రైతులు వనినాట్లు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, ఇరిగేషన్ ఈఎన్సీ అంజాద్ హుస్సేన్‌కు ఆదివారం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఫోన్లో విజ్ఞప్తి చేశారు.
శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నీటి విడుదల చేయాలని హరీశ్‌రావు లేఖ రాసిన విషయం తెల్సిందే. మరోసారి ఆదివారం ఉదయం ఫోన్లో మాట్లాడి రైతులు ఆందోళనలో ఉన్నారని, నాట్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ల నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు హరీశ్‌రావు తెలిపారు.