అమీన్పూర్, ఏప్రిల్ 18: ప్రజల అభిప్రాయం మేరకు అమీన్పూర్ నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ని తరలిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్టీపీని రద్దు చేసేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చర్చిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని 993 సర్వే నంబర్లో ఎస్టీపీ ఏర్పాటు చేసే స్థలంలో శనివారం ఆయా కాలనీల ప్రజలతో ఆయన సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృ ద్ధి చెందుతున్న అమీన్పూర్ పరిధిలో మురు గు నీటి జలాలను శుద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయన్నారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానిక కాలనీవాసుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వస్తుండడంతో మెజార్టీ ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయానికి అనుగుణంగా ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమీన్పూర్లో ఎస్టీపీని ఏర్పాటు చేయడం జరగదని స్పష్టం చేశారు.
అవసరమైతే ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి నక్కవాగులోకి తరలించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పనులను వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, జలమండలి సీజీఎం పద్మజ, జీఎం సుబ్బారాయుడు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.