Vemula Prashanth reddy | వేల్పూర్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, వృద్ధుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రజల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహిళలతో కలిసి MROకి అందజేశారు.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహ భారం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచాయని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు గత పదేళ్లుగా విజయవంతంగా అమలవుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం వారి అనుకూలమైన వ్యక్తితో కోర్టులో కేసు వేయించి ఈ పథకాన్ని రద్దు చేయాలన్న కుట్రలు చేస్తుంది. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా ఈ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదు..? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
వచ్చే విచారణలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తామని ప్రకటించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి పథకం తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రూ.50,000 సహాయంతో ప్రారంభమై, అనంతరం బీసీలతో పాటు అన్ని వర్గాల పేదలకు విస్తరించిందని వేముల గుర్తుచేశారు. ఆర్థిక సహాయాన్ని దశలవారీగా పెంచుతూ చివరకు రూ.1,00,116కు చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించిన కేసీఆర్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా అండగా నిలిచిందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించిందని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న ప్రతి అర్హురాలికి ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు అని వేముల అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోర్టులో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి, పథకాల కొనసాగింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలి. ఎన్నికల హామీ మేరకు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అందించాలన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలోని MRO కార్యాలయం వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్న BRS పార్టీ శ్రేణులు@BRSparty @KTRBRS pic.twitter.com/GVRxaAbVra
— Vemula Prashanth Reddy (@VPR_BRS) August 17, 2026