చిలిపిచెడ్, మార్చి 4: ‘మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. మండలం మీదుగా మంజీరా నది వెళ్తున్నా ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు’.. అని మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనానికి కలెక్టర్ రాహుల్రాజ్, వ్యవసాయాధికారులు స్పందించారు. గుజిరి తండాలోని ఎండిపోతున్న వరి పొలాలను కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. చండూర్ గ్రామ శివారులోని మంజీరా నది వద్ద ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి చెరువులు, కుంటలు నింపితే తమ బోర్లు బాగా నీరు పోస్తాయని గిరిజన రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
మండలంలో ఎన్ని ఎకరాల్లో వరిపంట ఎండిపోయిందని, చండూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయించలేదని మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ గౌడ్ ద్వారా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట ఏఈవో కృష్ణవేణి, గుజిరి తండా మాజీ సర్పంచ్ రాకేశ్నాయక్, రైతులు ఉన్నారు.