చిలిపిచెడ్,మార్చి 2 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని చండూర్‌కు చెందిన రైతు కుమ్మరి శేఖర్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, పక్కన ఉన్న మరోరైతు దగ్గర మూడెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో పొలం ఎండుతున్నది. దీంతో బోరుబావి తవ్వించాడు. బోరు 720 ఫీట్లు తవ్వించినా నీళ్లు రాలేదు.
దీంతో ఆ రైతు అప్పుల పాలయ్యాడు. మండలంలోని గుజిరి తండాకు చెందిన మరో గిరిజన రైతు బాన్సీలాల్ 700 ఫీట్లు బోరు తవ్వించినా నీరు రాలేదు. చిలిపిచెడ్ మండలంలో పలు గ్రామాల శివార్ల గుండా మంజీరా నది ప్రవహిస్తున్నా రైతుకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని గంగారం-చండూర్ గ్రామా ల్లో ఎత్తిపోతల ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. దానికి మరమ్మతులు చేసి నీళ్లందించాలని రైతులు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.