సంగారెడ్డి- నాందేడ్ 161 జాతీయ రహదారికి అనుసంధానంగా 45.96 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నిజాంపేట్- బీదర్ 161బీ డబుల్ లేన్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. ఐందేండ్ల క్రితమే ఈ రహదారికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ మంగళవారం ఇందుకు సంబంధించి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక సరిహద్దున ఉన్న నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని పదిహేను గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది. ఇప్పటికే సర్వే పనులు పూర్తవగా, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నారాయణఖేడ్, మార్చి 29 : ఐదేండ్ల క్రితం మంజూరైన బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. 161బీ జాతీయ రహదారిగా ప్రతిపాదించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది. సంగారెడ్డి-నాందేడ్ 161 జాతీయ రహదారికి అనుసంధానంగానే 45.96 కిలోమీటర్ల మేర నిజాంపేట్-బీదర్ 161బీ డబుల్ లేన్ జాతీయ రహదారి 2017 సంవత్సరంలో మంజూరైంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రెండు మండల కేంద్రాలు సహా మొత్తం 10 గ్రామాలు, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రం సహా మొత్తం ఐదు గ్రామాలు ఈ జాతీయ రహదారి పరిధిలోకి రానున్నాయి. 161బీ జాతీయ రహదారి ఏర్పాటు కోసం ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసి ఎస్డీఆర్ సైతం సిద్ధమైంది. భూసేకరణ ప్రక్రియలో నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో 140 ఎకరాల భూమిని జాతీయ రహదారి కోసం సేకరించాల్సి ఉండగా, ఇందుకోసం 3ఏ, 3డీ గెజిట్ పబ్లికేషన్స్‌ను ప్రచురించగా, 3.ఈ పబ్లికేషన్స్ ప్రచురించాల్సి ఉంది.
నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దున ఉండడంతో 161బీ జాతీయ రహదారి పూర్తయిన పక్షంలో అతర్రాష్ట్ర రవాణాకు మార్గం సుగమం కానున్నది. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు పొరుగు రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన బీదర్‌కు రాకపోకలు సాగించడమే కాకుండా అక్కడి ప్రజలతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి ఎంతో ఉపకరించనున్నది. కాగా, నిజాంపేట్ నుంచి బీదర్ వరకు 45.96 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానున్న ఎన్‌హెచ్ 161బీ గుండా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రెండు మండల కేం ద్రాలు నారాయణఖేడ్, మనూరు, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల కేంద్రం సహా నారాయణఖేడ్ మండలంలోని ర్యాలమడుగు, డీఎన్టీ తండా, వెంకటాపూర్, బాణాపూర్, జగన్నాథ్‌పూర్, పిప్రి, మనూరు మండలంలోని బెల్లాపూర్, పుల్కుర్తి గ్రామాలు, న్యాల్కల్ మండలంలోని రాఘవాపూర్, చాల్కి, ఇబ్రహీంపూర్, డప్పూర్ గ్రామాలు ఉన్నాయి.
సీఎం కేసీఆర్‌తోనే నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. నిజాంపేట్-బీదర్ 161బీ డబుల్ లేన్ జాతీయ రహదారి పనుల కోసం రూ.512.98 కోట్ల నిధుల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 46 కిలోమీటర్ల ఈ రహదారి పూర్తయితే నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 15 గ్రామాలకు డబుల్ లేన్ రోడ్డు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మారుమూల ప్రాంతాలు కూడా అన్నిరంగాల్లో పురోగతి సాధించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారమవుతుందనడానికి ఇదే నిదర్శనం.
-ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరువతో నారాయణఖేడ్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెం దు తుంది. నిజాంపేట్-బీదర్ 161బీ డబుల్ లేన్ జాతీయ రహదారి ఏర్పాటు కోసం రూ.512.98 కోట్లు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రహదారి పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగు పడడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. దీనికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్