జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున కేకులు కట్ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్నదానం చేశారు. ప్రజాప్రతినిధులు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు హరీశ్‌రావును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాక్షాంక్షలు చెప్పారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 3: సిద్దిపేట పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా కిక్కిరిసి పోయింది. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి, దేవీప్రసాద్, ఫరూఖ్ హుస్సేన్, విరాహత్ అలీ, వంటేరు ప్రతాప్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా మారింది. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు అభిమానులు పార్టీ కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సిద్దిపేట మోడల్ బస్టాండ్ వద్ద అన్నదానం చేశారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.