మెదక్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి, పంచాయతీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు నాలుగు నెలలు, మరికొంతమందికి 9,10 నెలల నుంచి వేతనా లు చెల్లించడం లేదన్నారు.
గ్రామా ల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్మికులు పారిశుధ్య పనులు, వాటర్ సప్లయ్, ఎలక్ట్రిషన్ పనులు చేస్తున్నారు. ఈ పని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వేరే ఆర్థిక అవకాశాలు ఏమీ లేవన్నారు. చేసిన కష్టం 9 నెలల నుంచి రాకపో తే కార్మికులు గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎలా చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
ప్రతినెలా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక మీడియా ఎదుట మాట్లాడారు. 2025 జనవరి 19న పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.149 కోట్లు విడుదల చేసింది. కానీ, పం చాయతీల నుంచి చెకులు పంపినా ఎస్టీవోలో నిలిచిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండేండ్ల నుంచి యూనిఫామ్, ప్రతినెలా సబ్బులు, నూనెలు ఇవ్వాల్సి ఉండగా, అవి కూడా ఇవ్వడంలేదన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. ధర్నాలో పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆసిఫ్, నాయకులు స్వామి, రమేశ్, రవి, వసంత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.