Medak | చేగుంట, మే 27: ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరీడు పొడవక ముందే ఇంటింటా తిరుగుతూ చెత్తబండి వచ్చిందమ్మా…తడిపొడిచెత్త వేరుచేసి ఇవ్వండమ్మా…అంటూ గ్రామంలో తిరుగుతూ ఊరును శుభ్రం చేస్తున్న సఫాయి కార్మికుల బాధలు వర్ణణాతీరం. పొద్దంతా కూలి పనిచేసి వచ్చిన డబ్బులతో పూట గడుపుకొనే ఈ రోజుల్లో… ఆరునెలులుగా వారికి జీతాలు అందడం లేదు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలో సుమారు 150 మందికి పైగా సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత ఆర్నెల్ల నుంచి జీతాలు రావడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో వారి బాధలు చూడలేక కార్యదర్శులు బయట అప్పుతెచ్చి రెండు, మూడు నెలల జీతాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలను నడపడం మునుపెన్నడూ లేనంత భారంగా మారిందని, పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే బాగుండేదని కార్యదర్శులు అంటున్నారు. రోజూ శుభ్రం చేసి, ఊరులోని చెత్తను తొలిగిస్తున్న తమకు జీతాలు చెల్లించాలని సఫాయి కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.