సిద్దిపేట, డిసెంబర్ 14 : సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 88.36% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నంగునూరు మండలంలో 90.16%, అత్యల్పంగా బెజ్జంకి మండలంలో 85.89% పోలింగ్ నమోదైంది. పల్లె జనం ఓటేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. వృద్ధులు తమ ఓటు హకును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ కె.హైమావతినంగునూరు మండలంలోని పాలమాకుల, సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల, ఎన్సాన్పల్లి, సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్, రాఘవాపూర్, మిరుదొడ్డి మండలం అల్వాల్, మిరుదొడ్డి, దుబ్బాక మండలం హబ్సీపూర్, పెద్దగుండవెల్లిలో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగిందని, అప్పటివరకు క్యూలో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతించినట్లు తెలిపారు. అనంతరం సిద్దిపేట కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు.