సంగారెడ్డి, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమైన పోలింగ్, 11 గంటల తర్వాత ఊపందుకుంది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తన స్వగ్రామమైన ఝరాసంగంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లి మండలంలోని తన స్వగ్రామం పోతులబోగూడలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి తన స్వగ్రామం డాకూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ తన స్వగ్రామం ఎల్గోయిలో కుటుంబీకులతో కలిసి ఓటు వేశారు.
మలి విడత పల్లెపోరులో 87.06 శాతం పోలింగ్ నమోదైంది. 229 సర్పంచ్ స్థానాలు, 1941 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీ పడగా, వార్డు సభ్యులకు 4526 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 2,99,746 మంది ఓటర్లకు 2,60,820 మంది ఓటు వేశారు. ఎన్నికల్లో 1,30,157(88%) మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు 1,30,660(86.15%) మంది ఓట్లు వేశారు. మునిపల్లి మండలంలో అత్యధికంగా 89.19 శాతం ఓటింగ్ నమోదైంది. అందోల్‌లో 87.98, చౌటకూరులో 87.47, ఝరాసంగంలో 88.59, కోహీర్‌లో 84.82, మొగుడంపల్లిలో 85.50, పుల్కల్లో 87.31, రాయికోడ్‌లో 88.40, వట్పల్లిలో 87.91, జహీరాబాద్‌లో 84.23 శాతం ఓటింగ్ నమోదైంది. మొదటి విడత ఎన్నికలతో పోలిస్తే రెండో విడతతో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. మొదటి విడతలో 87.96 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 87.06 శాతం పోలింగ్ నమోదైంది.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటలకు 73,871(24.66%)ఓట్లు, 11 గంటలకు 1,79,364(59.87%)ఓట్లు, 1గంటలకు 247911(82.75%) శాతం పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్‌తో కలిసి చివరగా 2,60,820(87.06%) ఓట్లు నమోదయ్యాయి. అందోల్ మండలం నాదులాపూర్‌లో గ్రామ బంటుగా పనిచేస్తున్న సత్యనారాయణను ఎన్నికల ఏజెంట్‌గా నియమించారని, సత్యనారాయణ ఎన్నికల కేంద్రంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ మద్దతు పలికిన సర్పంచ్ అభ్యర్థి అధికారులతో గొడవకు దిగారు. దీంతో సత్యనారాయణను పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు.
అందోల్ మండలం చింతకుంటలో గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్సుల్లో లెక్కిస్తున్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులు ధర్నా చేశారు. ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.