మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం 6 మండలాల్లో 160 సర్పంచ్ స్థానాలకు 152 నామినేషన్లు దాఖలు కాగా, 1402 వార్డు స్థానాలకు 186 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండు రోజుల్లో (27, 28 తేదీల్లో)సర్పంచ్ స్థానాలకు 207 నామినేషన్లు, వార్డు స్థానాలకు 190 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.
గజ్వేల్, నవంబర్ 28: తొలి విడతలో గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో భాగంగా గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432వార్డులకు రెండో రోజున అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రెండోరోజు శుక్రవారం సర్పంచ్ అభ్యర్థులు 194మంది నామినేషన్లు వేయగా మొత్తం 325కు చేరాయి. అదే విధం గా వార్డు సభ్యులకు రెండో రోజు 445మంది నామినేషన్లు వేయడంతో మొత్తం 520కి చేరాయి. శనివారం మూడో రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో అత్యధికంగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
కంది, నవంబర్ 28: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కంది మండలంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రెండో రోజు శుక్రవారం 20మంది సర్పంచ్ అభ్యర్థులు, 94 మంది వార్డుసభ్యులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కంది మండల పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 22 గ్రామ పంచాయతీలకు కాశీపూర్, కంది, జుల్కల్, కౌలంపేట్, చిద్రుప్ప గ్రామాల్లో అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చేర్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోచారం చంద్రకళ రాములు, కలివేముల సర్పంచ్ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి, కాశీపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పి.శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు తమ నామినేషన్లు వేశారు.