మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 14 : మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.
పలు పోలింగ్ కేంద్రాల్లో ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లాలోని 8 మండలాల్లో 149 గ్రామాల్లో 7 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 142 సర్పంచ్ స్థానాలకు, 1290 వార్డు స్థానాలకు 254 చోట్ల ఏకగ్రీవంగా కాగా, 1034 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. భోజన విరామం అనంతరం 2 గం టల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 21.83 శాతం, 11 గంటలకు 59.26 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 88.80 శాతం పోలింగ్ నమోదైంది