సిద్దిపేట, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.ఈనెల 11న తొలి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, గుర్తులతో ర్యాలీలు, కులసంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్నా ..మీ వాళ్ల ఓట్లు అన్నీ నాకే పడాలి..నన్ను గెలిపించగానే మీరు అడిగిన పనులు చేసి పెడతా…ఇదిగో బాండ్ పేపర్ రాసిస్తున్నా అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకో అభ్యర్థి మన ఊళ్లో ఉన్న కోతులను పట్టించే బాధ్యత తీసుకుంటా..నన్ను గెలిపించండి…మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ కట్టిస్తా.. మీకులం ఓట్లు నాకే పడాలి..మీ కులానికి మూడు లక్షలు ఇస్తున్నా.. మీగుడి నిర్మాణానికి పూర్తి ఖర్చు నేనే భరిస్తా అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
గ్రామంలోని యువతకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తా, ఏది ఏమైనా నాకే మీరంతా గంపగుత్తగా ఓటు వేయాలని ఎవరికి వారు అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామ పంచయతీ ఎన్నికలు పార్టీ రహీతంగా జరుగుతున్నప్పటికీ ఆయా రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థులు బరిలోకి దిగారు.దీంతో గ్రామాల్లో రసవత్తర పోరు జరుగుతుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, అత్తా కోడళ్లు, తండ్రీ కొడుకులు ఇలా బంధాలు పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికల్ల్లో పోటా పోటీగా చాలా మంది ఎన్నికల బరిలోకి దిగారు.సిద్దిపేట, మెదక్,సంగారెడ్డి జిల్లాల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగనున్నది.ఈనెల 11న తొలి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లలో పోలీస్ యం త్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తుంది. తొలి విడతలో సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాలు, మెదక్ జిల్లాలోని అల్లాదుర్గు రేగోడు, టేక్మాల్, హవేళీఘనపూర్, పాపన్నపేట, శంకరంపేట(ఏ) మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, సోషల్ మీడియా, వాయిస్ రికార్డు, ఆడియో, వీడియోల ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని గ్రూపు సమూహంగా తమ ప్రచారంలో కొత్త పోకడలు తెలియజేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులు కోవడం లేదు. గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మ్యానిఫెస్టోలు ప్రకటిస్తున్నారు.గ్రామ సమస్యలను పరిష్కరించకపోతే నిర్ణీత సమయంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తున్నారు.బాండ్ పేపర్లు రాసిస్తున్నారు.ప్రజలకు నిస్వార్థ చేసే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు. తమ గుర్తును వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్, రీల్స్, గ్రామ గ్రూపుల్లో వేయడంతో పాటు గ్రూప్ కాల్స్, వాయిస్ కాల్స్ ఇలా విభిన్న కోణంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
పల్లెల్లో పంచాయతీ పోరు ఉత్కంఠ రేపుతుంది. ఓటరు మనోగతం తెలియక అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఓటరు దగ్గరకు వచ్చిన ప్రతి నాయకుడికి తమ ఓటు నీకే అని చెబుతుండడంతో ఎవరి ఓటు ఎవరికి పడుతుందో తెలియక అభ్యర్థులు రోజురోజుకు టెన్షన్ టెన్షన్‌గా ప్రచారంలోకి వెళ్తున్నారు. తొలి విడుత ఎన్నికకు నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగియనుంది. తొలి విడుత ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా యువత ఓటర్లు పల్లెపోరులో కీలకంగా మారుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు యువతను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఏఊర్లో చూసినా యువత ఓట్లే కీలకమవుతున్నాయి. ఇవికాకుండా వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని రప్పించేందుకు అభ్యర్థులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వృత్తిరీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని గ్రామాల్లోకి రప్పించేందుకు అనుచరుల నుంచి వారివారి ప్రాంతాలకు పంపించి రప్పించుకుంటున్నారు.