చౌటకూర్, మే 22: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యింది. యాసంగి సీజన్‌కు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు స్పష్టమవుతున్నది. వారం క్రితం కురిసిన అకాల వర్షం నుంచి తేరుకునే లోపే మళ్లీ బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే తడిసిన ధాన్యంతో సతమతమవుతున్న రైతన్న నెత్తిన పిడుగు పడినట్లయ్యింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో దాదాపు ప్రతి గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం కారణంగా రైతుల ధాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కరువయ్యాయి. రైతులకు టార్పాలిన్లు సైతం అందజేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటా చేసిన బస్తాలు వర్షానికి తడుస్తున్నాయి. ఏ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాంటా వేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే అక్కడ కాంటా చేసిన బస్తాలను రైస్ మిల్లులు, ఇతర గోదాములకు తరలించేందుకు అవసరమైన లారీలు సమయానికి రాకపోవడంతో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. దీంతో వర్షాలకు ధాన్యమంతా తడిసి ముక్కిపోయి మొలకెత్తుతున్నాయి.
శివంపేట సొసైటీలో సరైన సౌకర్యాలను సమకూర్చడంలో కేంద్రం నిర్వాహకులు విఫలం కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఎండిన ధాన్యాన్ని తీసుకువస్తే కనీసం కాంటా చేసే వారు దిక్కులేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా చేసిన ధాన్యం బస్తాలనైనా గోదాములకు తరలించేందుకు లారీలు వస్తాయనుకుంటే, వారానికి ఒక లారీని పంపిస్తే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తడిసిన ధాన్యం ముద్దలుగా మారి ముక్కిపోయి మొలకలు వస్తుండడంతో మద్ద్ధతు ధర వస్తుందో రాదోనన్న బెంగ రైతులను వెంటాడుతున్నది.
ఇంతా జరుగుతున్నప్పటికీ, అధికారులు నిద్రపోతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు కనీసం ధాన్యం సేకరణపై సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అన్ని కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలు పంపించి ధాన్యం బస్తాలను తరలించాలని రైతులు కోరుతున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ గురువారం శివంపేట సొసైటీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన శివంపేటలోని శ్రీసాయి వీరభద్ర రైస్‌మిల్లును సందర్శించారు. లారీలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటూ ఆరా తీసి బస్తాలు ఆన్లోడ్ చేసిన లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.