హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 13: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఎటుచూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి మార్కెట్‌కు తెచ్చిన వడ్లను అమ్ముకోవడానికి రైతుల నిరీక్షించాల్సి వస్తున్నది. ముందుస్తు ప్రణాళికలు రూపొందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతుం డడంతో రైతులు అవస్థల పాలవుతున్నారు. పంటచేతికొచ్చి ధాన్యం మార్కెట్లోకి టన్నుల కొద్దీ తరలివస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు.
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల వద్దే రైతులు 15 రోజులుగా పడిగాపులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. వరికోతలు ముమ్మరం కావడంతో హుస్నాబాద్ మార్కెట్‌కు ధాన్యం భారీగా తరలివస్తున్నది. పదిహేను రోజులుగా ధాన్యం ట్రాక్టర్లలో రైతులు తేవడంతో మార్కెట్‌యార్డు మొత్తం వడ్లతో నిండిపోయింది. ధాన్యం పోసేందుకు స్థలం కరువైపోయింది. దాదాపు వెయ్యిక్వింటాళ్ల ధాన్యం ఇక్కడ అమ్మకానికి సిద్ధ్దంగా ఉంది. కొనుగోళ్లపై అధికారుల్లో ఇంకా మీమాంస వీడడం లేదు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదనే కారణంతో కొనుగోళ్లు చేయడం లేదని అధికారులు రైతులకు చెబుతున్నారు. కనీసం ధాన్యం పట్టేందుకు ప్యాడీక్లీనర్లను ఇవ్వాలని రైతులు కోరుతున్నా అరకొరగా ఇస్తూ సరిపెడుతున్నారు. ఎన్నిరోజులు మార్కెట్లో పడిగాపులు కాయాలని, త్వరగా కొనుగోళ్లు చేయాలని రైతులు మొర పెట్టుకుంటున్నా.. ఆలకించేవారు కరువయ్యారు. మరో వైపు వాతావరణం పరిస్థితులు చూసి వర్షం పడితే మా పరిస్థితి ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి వెంకట నర్సయ్య వివరణ కోరగా.. వడ్లు కొనమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. వడ్లు పట్టే క్లీనర్లు సరిచేస్తున్నామని, ఆదేశాలు వచ్చేవరకు ఏ రైతుకు ప్యాడీక్లీనర్లు ఇవ్వమని ఆయన తెలిపారు.
పది రోజులకింద తొమ్మిది ట్రాక్టర్ల వడ్లు మార్కెట్ తెచ్చినం. రోజూ వడ్లు ఆరబోసుడు కుప్పచేసుడు అయితాంది. వడ్లు పట్టుకుంటమని మిషన్లు ఇవ్వమని అడిగినా ఇస్తలేరు. రేపుమాపు అంటున్నరు. మస్తు ఇబ్బంది అవుతున్నది. మాలాంటి రైతుల గోస ఎవ్వరు పట్టించుకుంటలేరు. మిషన్లు ఇస్తే తొందర పట్టుకుంటం. వడ్లుతొందరగా కొంటే మిగతా వాళ్లకు అవకాశం ఉంటుంది.
– అయిలేని రజిత, రైతు, హుస్నాబాద్(సిద్దిపేట జిల్లా)
ఆగాలని అంటున్నరు. వడ్లు పండిం చి ఏం లాభం మాకు. అమ్మడానికి వత్తే ఈ బాధ ఉన్నది. పొలం కాడ పోద్దామంటే పొయ్యరాకుంట ఉన్నది. ఈడికి వత్తే జాగసరిగా దొరకతలేవు. ఈడింత అడింత కుప్పులు పోసినం. మల్ల వాన వత్తే ఎట్లోనని భయం అవుతున్నది. జల్ది వడ్లుకొంటే మాకు ఇబ్బంది పోతది.
-జెట్టి సంపత్,రైతు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)