మోర్తాడ్, ఆగస్టు 13: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయి. సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలని భావిస్తున్నాయి. మహిళా సంఘాలకు విరివిగా రుణాలను మంజూరుచేస్తూ సభ్యుల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకొని కొందరు బోగస్ సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకర్లతో కుమ్మక్కై రుణాలను తీసుకొని ఎగవేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల ఆధార్‌కార్డు వివరాలను దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్లైవ్లీహుడ్ మిషన్ జాతీయ వెబ్సైట్లో ఈకేవైసీ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియను సెర్ప్ సీఈవో దివ్యరాజన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో చేపట్టారు. మొబైల్ అప్లికేషన్లో మహిళా సంఘాలకు చెందిన ఒక్కో సభ్యురాలి ఆధార్ వివరాలను ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించే కార్యక్రమాన్ని కొనసాగుతున్నది.
జిల్లాలో ఈ నెలాఖరు వరకు మహిళా సంఘ సభ్యుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 28 మండల మహిళాసమాఖ్యలు, 806 గ్రామ మహిళా సమాఖ్యలు ఉండగా, ఇందులో 21,653 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 2లక్షల 8వేల 723 సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యురాలి ఈకేవైసీని గ్రామ సమాఖ్య సహాయకులు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 91,153 మంది సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయ్యింది. అనగా 44శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మహిళాసంఘాల్లో ఇస్తున్న రుణాల పరిమితి రూ.20లక్షల వరకు పెంచారు. ఒక్క బ్యాంకు రుణాలే కాకుండా మరోపక్క స్త్రీ నిధిలో ఒక్కో సంఘానికి రూ.8లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. వీటితోపాటు గ్రామసమాఖ్య ద్వారా మరో రూ.2లక్షల వరకు, స్వయం సహాయక సంఘం ద్వారా మరో రూ.లక్ష వరకు రుణం పొందే అవకాశం ఉన్నది. మొత్తం ఒక్కో మహిళా సంఘానికి రూ.30లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. వీటితోపాటు వ్యక్తిగత ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు గొర్రెలు, పెరటి కోళ్ల పెంపకం, డెయిరీ యూనిట్లు వంటి వాటికి రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇంత పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చే అవకాశం ఉండడంతో బోగస్ సంఘాలు పుట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది. ఈకేవైసీలో ఆధార్‌లో ఉన్న ఐరిష్‌తో మ్యాచ్ అయితేనే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంతో బోగస్ సభ్యులు ఉండే అవకాశం ఇకపై ఉండదు. అంతేకాకుండా ఒకరి స్థానంలో మరొకరు ఉండడం కూడా కుదరదు. తప్పనిసరిగా సభ్యురాలుగా ఉన్నవారు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల పరిమితి పెరగడం, స్త్రీనిధి, వ్యాపారరుణాలు ఇలా అనేక రకాలు రుణాల తీసుకునే అవకాశాలు ఉండడంతో బోగస్ సంఘాల ఏర్పాటు చేసి రుణాలు తీసుకుని ఎగవేయడం, ఒక గ్రూపులో ఉన్న పదిమందికి రుణాలు వస్తే.. అందరికీ రాలేదని డబ్బులు డ్రా చేసి ఇతరులు తీసుకుని వాడుకోవడం, మహిళాసంఘాలకు సంబంధించిన రుణాలు తీసుకోవడం, రికవరీ విషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్న సంఘటనలు బయటపడ్డాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈకేవైసీ పూర్తయితే బోగస్ సభ్యులు లేకుండా ఉండడమే కాకుండా, ఎటువంటిరుణాలైనా నేరుగా సభ్యురాలి ఖాతాకు వెళ్లే అవకాశం ఏర్పడనున్నది. ప్రభు త్వం అందించే సబ్సిడీ పథకాలు, వడ్డీ రాయి తీ, బ్యాంకు, స్త్రీనిధి రుణాలు ఈకేవైసీ చేసుకున్న సభ్యులకే అందే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి సాయన్న నేతృత్వంలో ఈకేవైసీ విధానం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఈకేవైసీ ప్రక్రియ ద్వారా బోగస్ సభ్యులు సంఘాల్లో కొనసాగడానికి ఎంతమాత్రమూ అవకాశం లేదు. ఈకేవైసీ పూర్తి చేసుకున్న సభ్యులకే ఇకముందు రుణాలు, వడ్డీరాయితీ, ఇతర సబ్సిడీ పథకాలు అందుతాయి. మహిళాసంఘాలకు సంబంధించిన ప్రతి సభ్యురాలు ఈకేవైసీ చేయించుకోవాలి.
-కుంట గంగాధర్, ఏపీఎం, ఏర్గట్ల