GPS | మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు నెలలకో ఒకసారి విడుదలయ్యేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీలకు నెలనెలా నిధులు విడుదల చేస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. దీంతో గ్రామ పంచాయతీలు ఆదర్శ పంచాయతీలుగా తయారయ్యాయి. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు కొన్నిచోట్ల ఇష్టానుసారంగా వినియోగించేస్తున్నారు. దీంతో డీజిల్‌కు అయ్యే వ్యయం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం నివారణ చర్యలు చేపట్టింది. దీంట్లోభాగంగా అధికారులు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు జీపీఎస్ అమర్చుతున్నారు.
జిల్లాలో 21 మండలాల్లో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌తో పాటు ట్రాలీ, వాటర్ ట్యాంకర్‌ను మంజూరు చేశారు. పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్‌ను అమర్చడానికి టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం మండలాల వారీగా ట్రాక్టర్లకు అమర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో ట్రాక్టర్లకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. అక్రమాలకు చెక్ పెట్టి పారదర్శకత పెంపొందించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
జిల్లాలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ ట్రాక్టర్లను కొందరు సర్పంచులు సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు ఇతర పనులకు ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నా యి. వారి సొంత పనులకు డీజిల్ కోసం పంచాయతీ నిధులు వెచ్చిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ అమర్చడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ ట్రాక్టర్‌కు డీజిల్ కోసం ఎన్ని డబ్బులు వెచ్చిస్తున్నారో గ్రామ ప్రజలకు తెలుస్తుంది. గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కోసం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది.. మొక్కలకు నీరు పోయడానికి ఎంత దూరం వెళ్లింది.. అనే వివరాలు ఇక పక్కాగా తెలుస్తాయి. పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ పరికరాలు బిగించిన డేటా మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్‌ను ఎవరైనా సొంత పనులకు వినియోగిస్తే వెంటనే తెలుస్తుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభల్లో ప్రజలు పాలకవర్గాన్ని అడిగే అవకాశం ఉంటుంది.
గ్రామ పంచాయతీల్లో ట్రాక్ట ర్లు ప్రతిరోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది.. ఎంత డీజిల్ వినియోగిస్తున్నారు అనే విషయాలు తెలుస్తాయి. జిల్లావ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లకు జీపీఎస్ అమలు చేశాం. ఈ పనులకు ఎంపీవోలు, డీఎల్పీవోలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే నోటీసులు ఇస్తున్నాం. పకడ్బందీగా పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ పరికరాలు అమర్చుతున్నాం.
– సాయిబాబా, డీపీవో, మెదక్