మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ కింద పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ.26,54,500 విలువ గల చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాల్, తిరుమలేశ్, మెదక్ పట్టణ, పాపన్నపేట, హవేళీఘణాపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు గంగాధర్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.