గజ్వేఅర్బన్, డిసెంబర్18: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌యార్డు పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో పత్తికొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఆయా సీసీఐ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. పత్తిని విక్రయించాలంటే ఆధార్ సంఖ్య, ఫోన్‌నెంబర్‌ను బ్యాంకుఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కొనుగోలు కోసం కేంద్రంలో రైతు వివరాలు నమోదు చేయగానే రైతుకు ఓటీపీ రావాల్సి ఉంటుంది. ఓటీపీ వస్తేనే కొనుగోళ్లు జరుగుతాయి. కాగా, పలువురు రైతులు ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో ఓటీపీ రాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకువచ్చిన పత్తిలోడుతో ఉన్న వాహనాలను కొనుగోలు కేంద్రాల వద్దే నిలిపి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓటీపీ రాని రైతుల పత్తి సీసీఐ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆ రైతులంతా తిరిగి ఇంటికే తమ పత్తిని తీసుకువెళ్లాల్సి వస్తున్నది. కొందరు రైతులు రవాణాఖర్చులకు వెనుకాడి ప్రైవేటుగా పత్తిని విక్రయిస్తున్నారు. సోమవారం ప్రైవేట్ మార్కెట్లో క్వింటాలు పత్తికి రూ.6,500 వ్యాపారులు చెల్లించగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి సీసీఐ కేంద్రంలో ధర రూ.7,020 చెల్లించారు. గజ్వేల్ పట్టణం శివారుల్లోని పత్తి జిన్నింగ్ మిల్లుల ద్వారా ఇప్పటివరకు 10వేల బేళ్లకు పైగా పత్తిని సిద్ధం చేసి సిద్దిపేటకు పంపినట్లు సీసీఐ అధికారులు వెల్లడించారు. గజ్వేల్ ప్రాంతంలో పత్తి నాణ్యత బాగా ఉండడంతో వివిధ రాష్ర్టాల వ్యాపారులకు విక్రయించేందుకు నిర్ణయించినట్లు సీసీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు వెల్లడించారు.