దుబ్బాక, జూలై 27: కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో పోచమ్మ ఆలయ పునఃనిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ ఎంపీ రఘునందన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికి మోడల్‌గా నిలిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆలయాలకు మహర్దశ చేకూరిందన్నారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే దుబ్బాకలో వేంకటేశ్వర ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. దుబ్బాకలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఎంపీ రఘునందన్ దుబ్బాక అభివృద్ధికి నిధులు వెచ్చించాలని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ఉప కాల్వల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకుందామని, దీనికోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతామని, అవసరమైతే జేఏసీ ఏర్పాటు చేసుకుందామన్నారు. అనంతరం దుబ్బాకలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, భూంరెడ్డి, బండి రాజు, స్వామి, శ్రీధర్, కృష్ణ, శ్రీనివాస్, వంశీ పాల్గొన్నారు.