పటాన్చెరు, జూన్ 7 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో విలువైన సర్కారు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుని రెవెన్యూ, నీటిపారుదల, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అటువైపు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
గ్రామస్తులు, కాలనీ వాసులు ఫిర్యాదులు చేయడంతో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తూతూమంత్రంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. భూముల ధరలు పెరిగిపోవడంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల అండ తో ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూములను కొందరు చెరబట్టి స్థలాలుగా చేసి విక్రయించిన సంఘటనలు ఈ ప్రాంతంలో వెలుగు చూస్తున్నాయి. స్థలాలు కొనుగోలు చేసిన వారు భవనాలు నిర్మాణం చేసిన తర్వాత కొందరు ఫిర్యాదులు చేయడంతో విచారణ చేసి అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు.
డబ్బులు ఇచ్చిన వారి భవనాలను అధికారులు కూల్చివేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా ప్లాట్లు చేసి అమ్మకాలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో బీరంగూడ, కృష్టారెడ్డిపేట, ఐలాపూర్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు కబ్జాలకు గురవుతున్నాయి.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని శెట్టికుంట, ఊబకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లు ఎవరు విక్రయించారు..? ప్లాట్ల్లలో ఇంటి నిర్మాణం చేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారో జిల్లా అధికారులు విచారణ చేపట్టాలనే డిమాండ్లు ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వేనంబర్ 947లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. తీరా ఇంటి నిర్మాణాలు పూర్తిచేసిన తర్వాత అధికారులు తూతూమంత్రంగా కూల్చివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అమీన్పూర్లోని ప్రభుత్వ భూములు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి అక్రమంగా ప్లాట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణల కోసం మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యు త్ శాఖ అధికారులు ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేసిన ఇండ్లకు కరెంట్ మీటర్లు ఇచ్చారు. అధికారుల అండదండలతోనే ప్రభు త్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఇండ్ల నిర్మాణానికి అనుమతులు లభిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.