గజ్వేల్, సెప్టెంబర్ 25: జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రభుత్వం దేశ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయాలు వసూలు చేసిందని, కానీ.. పేదలు, నిరుపేదల, మధ్య తరగతి ప్రజలు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రో, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు.
ఇవాలా జీఎస్టీ తగ్గించామని చంకలు గుద్దుకుంటున్నారని, ఎనిమిదేండ్లుగా జీఎస్టీని పెంచింది మీరే, తగ్గించింది మీరే అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే జీఎస్టీ శ్లాబులు తగ్గించారని, అంతేకాని ప్రజలపై ప్రేమతో కాదన్నారు. మేకిన్ ఇండియా అని మోదీ ఊదరగొడుతున్నారని, కానీ.. ఇప్పటికీ ఇతర దేశాల దిగుమతులపైనే భారత్ ఆధారపడుతున్నదని అన్నారు. తెలంగాణ నుంచి భారీగా జీఎస్టీ వసూలు చేసిన కేంద్రం… మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు.
మత రాజకీయాలు చేయడం తప్పా బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రూపాయి పతనం అయ్యిందని, జీడీపీ రేటు పడిపోతుండడానికి నరేంద్రమోదీ ప్రభుత్వమే కారణం అని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. విదేశాంగ విధానం సరిగ్గా లేక అనేక దేశాలు భారత్‌తో దూరం జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ కౌన్సిలర్లు అత్తెల్లి శ్రీనివాస్, గుంటుక రాజు, రజిత, మెట్టయ్య, గంగిశెట్టి రవీందర్, నాయకులు హైదర్‌పటేల్, మంజుల, బీరయ్య, అహ్మద్, రాములు తదితరులు పాల్గొన్నారు.