సిద్దిపేట, మే 7: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్‌రెడ్డికి అన్నదాతలపై లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరోడులోని ఐకేపీ కేంద్రంలో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే కలెక్టర్, ఆర్డీవో, సివిల్‌సప్లయ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి పాలన చేతకాకపోతే దిగిపోవాలని హితవు పలికారు. నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనేదికులేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని అందాల పోటీలపై రేవంత్‌రెడ్డి సమీక్షలు చేస్తున్నాడని, అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు పుట్టడం లేదని మాట్లాడటం అంటే సీఎంగా ఫెయిల్ అయ్యారనే అర్థమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు.
రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు తగ్గించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో కరోనా వచ్చినా, నోట్ల రద్దు అయినా ఏరోజు కూడా రైతులకు రైతుబంధు ఆపలేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలులో ఎన్నడూ ఇంత ఆలస్యం జరగలేదని, కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రైతుల నుంచి తరుగు పేరుతో 5కేజీల ధాన్యం కట్ చేస్తుందని మండిపడ్డారు.
కొనుగోలు చేయడంలో ఆలస్యంకావడం వల్ల వర్షాలు పడి ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షాలకు దెబ్బతిన్న కూరగాయలు, మామిడి పంటలు వేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే 43సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. మంత్రుల గాలిమోటర్ల ప్రయాణాలు తప్పా ఏం సాధించారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు రెవెన్యూ అధికారులు పర్యటించాలని సూచించారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నాయకులు విజేందర్‌రెడ్డి, చిట్యాల సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
వెల్దుర్తి, మే 7. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు నిరసన చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత నెల 16న ప్రారంభించి ఇప్పటివరకు తూకం వేయకపోవడంపై బుధవారం కుకునూర్ చౌరస్తా వద్ద రైతులు వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వం హమాలీలు రావడం లేదనే సాకుతో ధాన్యం తూకం వేయడం లేదని మండిపడ్డారు.
ఎప్పు డు కురుస్తుందో తెలియని అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారు లు స్పందించి ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాలలక్ష్మి, సొసైటీ చైర్మన్ అశోక్, ఆర్ఐ నర్సింగ్‌యాదవ్ రైతుల వద్దకు చేరుకున్నారు. ధాన్యం తూకం ప్రారంభిస్తామని హామీనివ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం కుకునూర్ కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ సందర్శించి గురువారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, సీరియల్ ప్రకారం ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీలు లేకుంటే ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని ఆమె సూచించారు.