Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2011లో అప్పటి తెలంగాణ ఉద్యమసారథి, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. పన్నెండు సంవత్సరాల తర్వాత పుష్కరాలను మళ్లీ ఘనంగా జరుపుకొనేందుకు సర్వం సిద్ధమైంది. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి వేడుకలను ప్రారంభించనున్నారు. భక్తులకు కోసం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక పూజల కోసం 108 హోమగుండాలు నిర్మించారు. మంజీరాలో పుణ్యస్నానం చేస్తే సర్వపాపాలు తొలిగిపోతాయనే నమ్మకంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
మెదక్రూరల్, ఏప్రిల్ 21: మంజీరా నది పుష్కర శోభను సంతరించుకున్నది. నేటి నుంచి మే నెల 3వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు నిర్వహించనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. మెదక్ మండలంలోని పేరూరు గ్రామ సమీపంలో గరుడగంగగా ప్రశస్తి పొందిన ప్రాంతం ఇప్పుడు మహాక్షేత్రంగా మా రింది. ఇక్కడే చదువుల తల్లి సరస్వతీ మాతను కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాన్ని సప్త రుషులు తప స్సు చేసిన పుణ్యభూమిగా, సర్పయాగం చేసిన విశిష్ట చరిత్ర గల వేదభూమిగా భక్తులు విశ్వసిస్తారు. 5250 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ స్థలంలో విభూతి మట్టిలో నుంచి వెలువడుతుంది. దీంతో ఇక్కడి ప్రదేశం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. భక్తులు తరలివచ్చి గరుడగంగలో స్నానమాచరించి విభూతిని ధరించి శ్రీ సరస్వతీమాతను ప్రత్యక్ష్య నాగదేవతగా దర్శించి తరిస్తుంటారు.
గరుడగంగ పుష్కరాలు ఇలా…
పేరూరు శివారులో గరుడగంగ మంజీరా నది ప్రాంతంలో 2011లో మొట్టమొదటి సారిగా ప్రస్తుత సీఎం, అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్, పుష్కరాలను ప్రారంభించారు. 12 ఏండ్ల అనంతరం ఈ నెల 22 నుంచి మే 3వ తేదీవరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి.
ప్రారంభించనున్న మాధవానంద సరస్వతి
గరుడగంగ పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభిస్తారు. నిత్యం సహస్ర కలశాలతో మంజునాథుడికి అభిషేకం నిర్వహించనున్నారు. చిలుకూరు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సిద్దలఖ్మీ, గణపతి, పుష్కర దేవతా హవనం 108 హోమగుండాల్లో నిర్వహించనున్నరు.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వతీర్థాలు మంజీర నదిలో చేరుతాయని, ఆ సమయంలో శక్తిమంతులైన మహాపురుషులు, దేవతలు పక్షి రూపాలు ధరించి మంజీర నదిలో స్నానం చేస్తారని, అప్పుడు నదిలో స్నానం చేసినా, విశేషమైన హోమాలు చేసినా విశేష ఫలం కలుగుతుందని బ్రహ్మపురాణంలో పేర్కొన బడిందని కాశీనాథ్బాబా తెలిపారు. గంగానదికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహరాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్యలో గురుడు ఉండగా కృష్ణా నదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో.. మేషంలో సూర్యుడు ఉండగా మంజీర నదిలో ఒకసారి స్నానం చేసినా అంత ఫలం వస్తుందని, ఈ కుంభమేళాలో భాగంగా ఈనెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు
మెదక్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల పేరూరు శివారులో ఉన్న గురుడగంగ సరస్వతీ ఆలయానికి బస్సులు, ఆటోలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ పుష్కరాలు 12 రోజులు కొనసాగుతాయి. పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. సర్పయాగం జరిగిన ప్రాంతంలో పవిత్ర స్నానం చేస్తే మంచి జరుగుతుంది. ఉత్తరవాహినిగా ప్రవహించే ఈ పుణ్యనదికి 12 ఏండ్ల కొకసారి జరిగే పుష్కరాల్లో స్నానాలు ఆచరిస్తే సకల దోషాలు తొలిగిపోతాయి. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాం. పుష్కరాలు పూర్తయ్యే వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సరస్వతీ మాతను కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తులు కొలుస్తారు. మహోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి.
– దోర్బల రాజమౌళి శర్మ, పూజారి, ఆలయ నిర్వాహకుడు