సంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్‌కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో అనిల్‌కుమార్ పేరును ప్రకటించారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో అనిల్‌కుమార్ గెలుపొందటం ఖాయమని చెబుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్‌కు ఎంపీ టికెట్ దక్కడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ ఎంపీ టికెట్‌ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆశించారు. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు తమ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతి పత్రాలు అందజేయగా, ఈ విషయాన్ని అధినేత కేసీఆర్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం మరోమారు పార్టీ ముఖ్యులతో చర్చించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్యనాయకులతో ఎంపీ అభ్యర్థి ఎంపికపై మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్యనేతలు గాలి అనిల్‌కుమార్ మద్దతు పలకడంతో కేసీఆర్ బీసీ సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్కుమార్వైపు మొగ్గుచూపారు. జహీరాబాద్ పార్లమెంట్ నేతలు సమక్షంలోనే మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
కేసీఆర్ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై గాలి అనిల్‌కుమార్ సంతోషంగా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న తనకు అధినేత కేసీఆర్ న్యాయం చేశారని తెలిపారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ నేత గాలి అనిల్‌కుమార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించింది. గాలి అనిల్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చివరి వరకు ఆశ చూపించి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధిష్టానం తను మోసం చేసిందని గ్రహించిన అనిల్‌కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్‌కుమార్‌కు అధినేత కేసీఆర్ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. గాలి అనిల్‌కుమార్ జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని మాడ్గిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ దక్కడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.