హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 1: అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హుస్నాబాద్‌లో మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రం నిర్మాణం పూర్తయింది. బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బుధవారం ప్రారంభిస్తా రు. బహిరంగ ప్రదేశాల్లో మానవ మలాన్ని పడేయడంతో ఎదురవుతున్న సమస్యలను దూరం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మానవ మల వ్యర్థాల శుద్ధి బుధవారం నుంచి హుస్నాబాద్ పట్టణంలో మొదలు కానున్నది.
హుస్నాబాద్ శివారులో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)ను నిర్మించేందుకు టీయూఎఫ్ఐడీసీ కింద రూ.1.10 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎల్లమ్మచెరు వు సమీపంలో ఎకరా స్థలంలో ఈ ప్లాంట్ నిర్మా ణం చేపట్టారు. ప్లాంట్‌లో ప్రహరీ, ఆపరేటర్ గది, శిక్షణ గది, అనరబిక్ స్టెబిలైజేషన్ రియాక్టర్, స్లడ్జ్ డ్రైయింగ్ బెడ్స్, బ్యాలెన్సింగ్ ట్యాంకు, ప్లాంటెడ్ గ్రావెల్ ఫిల్టర్, పాలిషింగ్పాండ్, అనరబిక్ బ్యాపి ల్ రియాక్టర్ తదితర పనులు చేపట్టారు.
పట్టణం లో రోజువారీగా సేకరించిన పదివేల లీటర్ల మాన వ వ్యర్థాలను వివిధ పద్ధ్దతుల్లో శుద్ధ్దిచేసి ఎరువును వ్యవసాయానికి ఉపయోగిస్తారు. మొక్కల పెంపకానికి వాడుతారు. హుస్నాబాద్‌లో ప్రారంభమవుతున్న ఎఫ్ఎస్టీపీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మూడేండ్లకు ఒకసారి తప్పనిసరిగా సెఫ్టిక్ట్యాంక్ను క్లీన్ చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ ఏఈ పృథ్వీరాజు కోరారు.