మెదక్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం రాయితీపై అందిస్తున్న చేప పిల్లలు నేటికీ పూర్తి స్థాయిలో చెరువులకు చేరలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది వారు ముందుకు రాక జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చేప పిల్లల సరఫరాలో అలసత్వం వహిస్తున్నట్లు సమాచారం. అయితే జూలై- ఆగస్టు మధ్య కాలంలో వదలాల్సి ఉండగా, ఇప్పుడిప్పుడు వదులుతున్నారు. మెదక్ జిల్లాలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ మెదక్ మండలం రాయిన్పల్లి ప్రాజెక్టులో 92 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా చెరువుల్లో చేప పిల్లలను ఎప్పుడు వదులుతారో, అవి ఎప్పుడు ఎదుగుతాయోనని మత్స్యకారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులు సామాన్యంగా ఫిబ్రవరి, మార్చి నాటికి ఎండుముఖం పడతాయి. ఏప్రిల్, మేలో పూర్తిగా నెర్రలు బారే అవకాశం ఉంది. జాప్యం జరిగే కొద్ది చేపలు ఎదగక నష్టపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఈసారి మాత్రం నవంబర్లో చెరువుల్లో చేపపిల్లలను వదిలితే ఆపిల్లలు ఎదుగుతాయో లేదోనన్న అనుమానం వ్యక్తమవుతోం ది. గత సంవత్సరం 1654 చెరువుల్లో 4 కోట్ల 63 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సారి ఇందులో సగం కూడా వదలడం లేదు. కేవలం 66 లక్షల 50వేలు మాత్రమే చేప పిల్లలను వదలడానికి మత్స్యశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం 82 చెరువుల్లోనే చేప పిల్లలను వదలనున్నారు. 35 నుంచి 40 మిల్లీమీటర్ల పిల్లలను వదలనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదలడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ విషయమై సొసైటీలు, మత్స్యకమిటీలకు సమాచారం అందించాం. ఈ సారి మెదక్ జిల్లాలో 66 లక్షల 50వేల చేప పిల్లలను వదలడానికి సిద్ధంగా ఉన్నాం.
– మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి, మెదక్