హుస్నాబాద్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను మెడలు వంచి అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని 2, 14, 15, 20వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్లో చేరి మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు ఐదేండ్లు అనుభవించిన వారిని ఓటమి భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ లో చేర్చుకున్నాడన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి పొన్నంకు చుక్కెదురు కావడం, ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. నెలకు రూ. 2,500లు, తులం బంగారం, గ్యాస్ డబ్బులపై మహిళలు నిలదీసి అడగాలన్నారు. యాసంగి సీజన్ అయిపోతున్నా ఇప్పటి వరకు రాని రైతు భరోసా, రైతు బీమాపై రైతులు, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగ యువతీ యువకులు కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపించాలన్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన మాయ మాటలే మళ్లీ ఈ ఎన్నికల్లో చెబుతూ ఓట్లు అడుగుతున్నారని, వారి అబద్ధ్దాలను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. మళ్లీ రెండున్నరేండ్లలో అఖండ మెజార్టీతో కేసీఆర్ సీఎం అవుతారన్నారు.
హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వార్డుల్లో ప్రచారానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ రవీందర్‌రావుకు ప్రతి ఇంటి వద్ద మహిళలు, ఓటర్లు స్వాగతం పలుకుతున్నారు. మహిళలు బొట్టుపెట్టి బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటువేస్తామని చెప్తున్నారు. 20వార్డుల్లోని అభ్యర్థులకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్నందున అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.