మెదక్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2001లో నా స్వప్నం.. నా ధ్యేయం తెలంగాణ సాధననే అని బయలుదేరిన కేసీఆర్.. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు.
14 ఏండ్లు అలుపెరుగని పోరాటంతో ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై ప్రత్యర్థులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు శరమగీతం పాడాలని సూచించారు. ఏడాది తిరకగముందే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి యువత తరలివచ్చి దీక్షా దివస్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.