రామాయంపేట, నవంబర్ 16: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. రైతుభరోసా ఇవ్వకుండా, పంట రుణమాఫీ సరిగ్గా చేయక, ధాన్యం కొనకుండా రేవంత్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేయూత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం, మంత్రులకు మధ్య సఖ్యత లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఏ ఒక్క పథకం అమలుపర్చడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన అల్లుడి కాంట్రాక్టుల కోసం ఢిల్లీకి, హైదరాబాద్‌కు తిరుగుతున్నాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు పూర్తి న్యాయం చేసింది కేవలం బీఆర్ఎస్ ఆధినేత కేసీఆరేనని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామని పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ఉమామహేశ్, సుభాష్, సిద్ధ్దరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, కాట్రియాల శాములు, సురేష్, నరేందర్‌రెడ్డి, కిషన్, స్వామి, బాలరాజు, చింతల రాములు తదితరులు ఉన్నారు.