నారాయణఖేడ్, డిసెంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి పదేండ్లు వెనక్కి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేసిన రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రూ.15 కోట్ల టీయూఎఫ్ఐడీసీ పనుల టెండర్లను రద్దుచేసి ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, షాదీఖాన, ముస్లిం శ్మశానవాటిక, నీటిసంపు సామర్థ్యం పెంపు, అదనపు పైప్‌లైన్ కోసం మంజూరు చేసిన రూ.12 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తన కృషితో మంజూరు దశలో ఉన్న రూ.50 కోట్ల రోడ్డు భద్రత నిధులు కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో దూరమైనట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ చొరవతో మేజర్ పంచాయతీగా ఉన్న నారాయణఖేడ్‌ను మున్సిపాలిటీగా మార్చి, గత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో ప్రతి సమస్యను గుర్తించి అభివృద్ధి చేశానన్నారు. రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.35 కోట్లు, డీఎంఎఫ్టీ నిధులతో మున్సిపాలిటీకి జేసీబీ, ఆటోలు, ట్రాక్టర్లను సమకూర్చినట్లు గుర్తుచేశారు.
విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు సుమారు 4 స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు పట్టణానికి 15 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసి నీటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. 100 పడకల దవాఖాన, 50 పడకల మాతాశిశు దవాఖానతో పాటు ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, గ్రంథాలయ భవనాన్ని నిర్మించామని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజాసమస్యలే కేంద్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు చందాలు వేసుకుని చేసుకున్న పనులను రికార్డు చేసుకుని బిల్లులు తీసుకుంటున్నారని, మున్సిపల్ జనరల్ ఫండ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రియల్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కాశీనాథ్ మందిర్, రాధాకృష్ణ మందిర్, శ్రీరామ మందిరం భూముల్లో నుంచి రోడ్డు వేయడం వెనుక గల మతలబేమిటని ప్రశ్నించారు. రహదారుల ఏర్పాటుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించి రోడ్డు వేయాలని, ఆలయాల భూములను ఆక్రమించి రోడ్డు వేసే అధికారం ఎక్కడిదని నిలదీశారు.
ఈ విషయమై తాము న్యాయపరంగా పోరాడుతామని, ఆలయ భూములను అన్యాక్రాంతం కానియబోమన్నారు. బీఆర్ఎస్ పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, తమ స్వలాభం కోసం ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలను ఆయన హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు ఎం.ఏ.నజీబ్, పరశురామ్, రవీందర్‌నాయక్, ముజామిల్, విఠల్ పాల్గొన్నారు.