సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 25 : అన్నిరంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని, మంత్రుల పంచాయితీలు చూసి ప్రజలు కాంగ్రెస్ సర్కారు అంటేనే విసుక్కుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మోహిన్‌పురా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడు తూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిద్దిపేటకు వచ్చి నిజాలు చెబుతానని, అన్నీ అబద్ధ్దాలు మాట్లాడారని విమర్శించారు.
గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఉందన్నారు. కేబినెట్ సమావేశంలో పర్సంటేజ్‌లు పంచుకోవడం, పంచాయితీలు పెట్టుకోవడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. విద్యార్థులు, యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారని, దానిమీద కేబినెట్లో చర్చ జరగాలన్నారు. వడ్ల కొనుగోలు జరగక రైతులు ఆగమవుతున్నారని, దాని మీద చర్చ జరగాలన్నారు. ఇస్తానన్న పంట బోనస్ రూ.1300 కోట్లు, గురుకులాల సమస్యలు, విద్యార్థుల కరెంటు కష్టాలు, ఎలుకలు, కుక్క కాట్లతో దవాఖానల పాలవుతున్న విషయాలపై చర్చ జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఓటమి ఎరుగని నాయకుడు హరీశ్‌రావు మీద మాట్లాడటం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే అని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లాంటి వాళ్లను చూస్తే సిగ్లు అనిపిస్తుందన్నారు.
దున్నపోతు అని సహచర మంత్రి అన్నా ఇంకా ఆ మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నావని ఎద్దేవా చేశారు. రిజ్వీ మీద మంత్రి జూపల్లి సీఎంకు ఐదుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదన్నారు. సిద్దిపేటనే కాదు.. తెలంగాణలోని 33 జిల్లాల్లో హరీశ్‌రావుకు ఒకే రకమైన ఆదరణ ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. రాజకీయాలు చేయడానికి సిద్దిపేట వస్తామంటే, సిద్దిపేటలో అడుగు కూడా పెట్టనిచ్చే వారు కాదని రసమయి అన్నారు.