సిద్దిపేట, మార్చి 31: పదేండ్లలో ముస్లింల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎక్బాల్ మినార్ వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రంజాన్ పండుగను హిందూ, ముస్లిం అనే భేదాభిప్రాయాలు లేకుండా చేసుకోవాలని, నిన్న ఉగాది రోజు ముస్లింలు హిందువుల ఇండ్లల్లోకి వచ్చి భక్షాలు తినడంతో పాటు ఉగాది శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా హిందువులు ముస్లింలను అలయ్ బలయ్ చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారన్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి మనదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మతాలకతీతంగా సోదరభావంతో ఒకరి పండుగల్ని ఒకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపికతో, శాంతితో కలిసిమెలసి దేశం,రాష్ర్టాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, భూపేశ్, ఆక్తర్ పటేల్, ఇర్షాద్ హుస్సేన్‌లతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.