గజ్వేల్, డిసెంబర్ 19: బీఆర్ఎస్ మారిన ఎమ్మెల్యేలు మేజర్లని, వాళ్లన్నీ నిజాలే చెప్పిండ్రని, అందుకు స్పీకర్ ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తేల్చారని మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి అబద్ధం ఆడడానికైనా సిగ్గుండాలని, అబద్ధ్దాల్లో నోబెల్, ఆస్కార్ అవార్డులు ఆయనకు ఇవ్వాలని, కండ్లు కనబడకపోతే.. చెవులుండి వినపడకపోతే ఏమీ చేయలేమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని తిరిగారా లేక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించమని తిరిగారా సమాధానం చెప్పాలన్నారు.
సీఎం ఇచ్చిన లిస్ట్‌లో బాన్సువాడ, చేవెళ్ల, జగిత్యాల, భద్రాచలం, గద్వాల్లో గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్‌లోనే గెలిచిండ్రని చూపించావు మరి, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్ కాదా సమాధానం చెప్పాలన్నారు. వాళ్లు మేజర్లు నిజమే చెప్పిండ్రని, చిన్న పిల్లలు కాదన్నారు. నీ దృష్టిలో చిన్న పిల్లలు అబద్ధ్దాలు చెప్పుతారా… చిన్న పిల్లలది స్వచ్ఛమైన పాలరాతి మనస్సు ఉంటుందని, వాళ్లే అన్ని నిజాలు చెప్పుతారన్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ కండువాలు కప్పుకుంది నిజం కాదా, కాంగ్రెస్ తరపున సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజమన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసింది నిజమని, వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ అని పేపర్ చదివే అందరికీ అర్థమవుతదన్నారు. కాంగ్రెస్‌లో చేరలేదని, వాళ్లంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రేవంత్‌రెడ్డి మాట్లాడితే ప్రజలు ఏమీ అనుకుంటారనే సోయి కూడా లేదని పచ్చి అబద్ధ్దాలు రేవంత్ మాట్లాతుండన్నారు.
గెలువని సర్పంచ్‌లు గెలిచిండని, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చేరలేదంటుండని, పిల్లలకు పుడ్ ఫాయిజన్ అయిందంటే కాలేదంటూ అసలు ఏమీ మాట్లాడుతుండో సీఎంకే అర్థమవడం లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎంజీఎం దవాఖానలో మంచాలపై ఎలుకలు తిరుగుతున్నది కన్పించడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 40శాతం సర్పంచ్ స్థానాలు గెలిచే సరికి సీఎంకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. ఓ ఎమ్మెల్యే పోలింగ్ బూత్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చుండని, మరో ఎమ్మెల్యే మీ ఊర్లకే రానని, ఇంకో ఎమ్మెల్యే పింఛన్లు అపుతానని బెదిరించింది నిజం కాదా అని హరీశ్‌రావు అన్నారు.
అయినా బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. మొదటి విడత సర్పంచ్ ఫలితాలు చూశాక సీఎం రేవంత్‌రెడ్డి డబ్బు మూటలను హైదరాబాద్ నుంచి రెండో, మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అడ్డగోలుగా పంపించాడని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై విసుగెత్తి ప్రజలు ఓడించారని, ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పథకాలన్నీ అమలు చేయాలన్నారు. యాప్‌లు, మాప్లు వదిలిపెట్టి ఎప్పటిలాగా యూరియా రైతులకు అందుబాటులోకి తేవాలని డి మాండ్ చేశారు. సాధారణంగా అధికార పార్టీ 90శాతం సర్పంచ్‌లు గెలుస్తదని, బీఆర్ఎస్ గతంలో అలాగే గెలిచిందన్నారు. జిల్లా పరిషత్‌లో వందశాతం, డీసీసీబీలు వందశాతం, మున్సిపల్‌లు 99శాతం, సర్పంచ్‌లు 90శాతం గెలిచామన్నారు. ఈ రోజు మీరు ఎందుకు గెలవలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎంను హరీశ్‌రావు ప్రశ్నించారు.
యూరియా సరిగ్గా ఇవ్వలేదని, పంట రుణమాఫీ సరిగ్గా చేయలేదని, రైతుబంధు ఎగ్గొట్టారని, రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేశారని, అందువల్లే ప్రజలు కాంగ్రెస్‌ను ఓడగొట్టారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 179 సర్పంచ్ స్థానాలకు 92 బీఆర్ఎస్ గెలుపొందగా, 68 కాంగ్రెస్ గెలిచిందన్నారు. సీఎం అయి ఉండి నిస్సిగ్గుగా లెక్కలు తారుమారు చేసి రేవంత్‌రెడ్డి అబద్ధ్దాలు మాట్లాడారని హరీశ్‌రావు విమర్శించారు. రెండేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి గజ్వేల్ రోడ్లకు తట్టెడు మట్టి ఎత్తలేదని, మీ రెండేండ్ల కాలంలో గజ్వేల్‌కు చేసింది శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండె మధు పాల్గొన్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 19: నాబిడ్డ కష్టపడి చదివి కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు సంపాదించినప్పటికీ ట్యూషన్ ఫీజు చెల్లించే స్థోమత లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఎమ్మెల్యే హరీశ్‌రావు సార్ ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా నలుగురు బిడ్డలు హరీశ్‌రావు సార్ స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్దబిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దకించుకున్నది. రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేము ఒకరం. అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా ఒక్కక్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టి నాబిడ్డ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సార్ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
– రామచంద్రం, విద్యార్థిని మమత తండ్రి